Pushpak Buses Started In Hyderabad : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త పుష్పక్ బస్సులను నడపనున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పుష్పక్ ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను నడపనున్నారు. జేబీఎస్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి, ఎయిర్‌పోర్టు నుంచి సికింద్రాబాద్‌కు ప్రతి గంటకో బస్సు అందుబాటులో ఉండనుంది. ఈ కొత్త పుష్పక్ సర్వీస్‌లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, సచివాలయం, నాంపల్లి, అఫ్జల్‌గంజ్, బహదూర్‌పుర, ఆరంఘర్ మీదుగా ఎయిర్‌పోర్టు వరకు నడపనున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. నేటి నుంచి కొత్త సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త సర్వీసులు ఉదయం 5.50 నుంచి అర్ధరాత్రి 12 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ప్రతి రోజూ ఆరు బస్సులను 24 ట్రిప్లుగా నడపనున్నారు.
గతేడాది అందుబాటులోకి బస్సులు : అందుబాటులోకి ఎలక్ట్రిక్ బస్సులు : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మహాలక్ష్మి పథకం అమల్లోకి తెచ్చింది. దీంతో బస్సు ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కొత్త బస్సులను రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అందుబాటులోకి తీసుకొచ్చింది. టీజీఎస్‌ఆర్టీసీ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను నడుపుతుంది. 500 బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే ఆర్టీసీలో త్వరలోనే 3 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. మహిళా శక్తి, మెప్మా ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు.