OMR Sheets For 10th Class Pre Final Exams : పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఓఎంఆర్ పత్రంలో వివరాలను నింపడం తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ప్రీ ఫైనల్ పరీక్షలు రాసే విద్యార్థులకు నమూనా ఓఎంఆర్ పత్రాలను అందించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల్లో ప్రతిరోజూ ఓఎంఆర్ పత్రాలను విద్యార్థులకు ఇస్తారు. అందులో ప్రతి విద్యార్థి తనకు ఇచ్చిన ఆన్సర్ బుక్‌లెట్ సంఖ్యను తప్పకుండా రాయాలి. దానిపై సంతకం కూడా చేయాలి.
విద్యార్థికి సంబంధించిన మరిన్ని వివరాలు అందులో ముందుగానే ముద్రించి ఉంటాయి. వాటిని విద్యార్థులు ఒక సారి చెక్ చేసుకోవాలి. వివరాల్లో తప్పులున్నా ఆ ఓఎంఆర్ తనది కాకపోయినా వెంటనే ఇన్విజిలేటర్‌కు చెప్పాలి. వారిచ్చే ఇతర నామినల్ రోల్ పత్రంలో నెమ్మదిగా సరైన వివరాలను రాయాలి. అయితే విద్యార్థులకు వారి పాఠశాలల్లో జరిగే ఎఫ్‌ఏ, సమ్మేటివ్ తదితర పరీక్షల్లో ఓఎంఆర్ పత్రాలను ఇవ్వడం లేదు. నేరుగా తుది పరీక్షల్లోనే ఓఎంఆర్ ఇస్తున్నారు. అలా ఇవ్వడం వల్ల విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. కొందరు విద్యార్థులు తప్పులు చేస్తున్నారు. మరికొందరికి సమయం వృథా అవుతోంది. అది ఫలితాలపై ప్రభావం చూపే అవకాశముంటుంది.
దీన్ని నివారించేందుకు మార్చి 6 నుంచి జరగనున్న ప్రీ ఫైనల్ పరీక్షల్లో నమూనా ఓఎంఆర్ పత్రాలను ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. దానివల్ల విద్యార్థులకు అలవాటు అవుతుంది. సాధన చేసినట్లు అవుతుందని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి భావిస్తున్నారు. గత ఏడాది వరకు 4 పేజీల మెయిన్ బుక్‌లెట్ ఇచ్చేవారు, అవి సరిపోకపోతే అదనపు షీట్లను ఇచ్చావారు. అదనపు షీట్ల సంఖ్యను కూడా ఓఎంఆర్ పత్రంపై రాసేవారు.
ఈసారి అదనపు షీట్లు లేవు : ఈసారి ఇంటర్మీడియట్ తరహాలో 24 పేజీల బుక్‌లెట్‌ను ఇస్తున్నారు. అంటే అదనపు పత్రాలు ఎన్నో రాయాల్సిన అవసరంలేదు. ఇలాంటి మార్పులు కూడా ఉన్నందున నమూనా ఓఎంఆర్ పత్రాలను అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన ఎస్‌సీఈఆర్‌టీ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
పదో తరగతి విద్యార్థులు కాస్త శ్రద్ధ పెడితే చాలు - ఆ సబ్జెక్ట్‌లో మంచి మార్కులు మీ సొంతం!