Trump On Job Cuts : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు తన ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(డోజ్) విభాగానికి మరిన్ని అధికారాలు కట్టబెట్టారు. ఈ మేరకు ఓవల్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై తాజాగా ట్రంప్ సంతకం చేశారు. ఈ నిర్ణయంతో అమెరికా ప్రభుత్వంలో పెద్దఎత్తున ఉద్యోగాల కోతలు ఉండనున్నాయి. అనవసర ఉద్యోగాల కోతతో లక్ష కోట్ల డాలర్ల వరకు పొదుపు చేయొచ్చని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది.
డోజ్ సంప్రదించిన తర్వాతే తొలగింపు
అమెరికా ఏజెన్సీలు ఉద్యోగాల్లో కోతలు పెట్టేందుకు ప్రణాళికలు చేసుకోవాలని ట్రంప్ ఆదేశించారు. ఇందుకోసం ఎలాన్ మస్క్‌తో పనిచేయాలని ఏజెన్సీలకు సూచించారు. డోజ్ సహకారం, సంప్రదింపుల తర్వాతే ఉద్యోగుల తొలగింపు, నియామకాలపై నిర్ణయం తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలగించగల ప్రభుత్వ ఉద్యోగులను, పూర్తిగా తొలగించగల విధులను గుర్తించాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో సూచించారు. మరోవైపు డోజ్ పనితీరును ట్రంప్ ప్రశంసించారు. దావాలను పట్టించుకోకుండా డోజ్‌ను ముందుకు తీసుకెళ్లాలని మస్క్‌కు సూచించారు. ఉద్యోగాల కోతలు విధించే వాటిలో లా ఎన్‌ఫోర్స్‌మెంట్, నేషనల్ సెక్యూరిటీ , ఇమ్మిగ్రేషన్ విభాగాలకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో మినహాయింపు ఇచ్చారు.
ట్రంప్ ఆదేశాల మేరకే
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేసే ముందు ఎలాన్ మస్క్ ఆయన పక్కనే ఉన్నారు. "మేక్ అమెరికా గ్రేట్ అగేన్" అనే పేరుతో ఉన్న క్యాప్‌ను ఆయన ధరించారు. మస్క్‌తో పాటు ఆయన నాలుగేళ్ల కుమారుడు సైతం అక్కడే ఉన్నాడు. కుమారుడిని భుజాలపై ఎక్కించుకుని మీడియా అడిగిన ప్రశ్నలకు మస్క్ సమాధానమిచ్చారు.
'ట్రంప్ ఆదేశాల మేరకు ప్రభుత్వ విభాగాల్లోని వ్యర్థాలను తగ్గించే ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తున్నా. ప్రభుత్వ పరంగా భారీ సంస్కరణల కోసమే ప్రజలు ఓటు వేశారు. అదే ఇప్పుడు ప్రజలకు చేస్తున్నాం. ప్రజాస్వామ్యం అంటే ఇదే కదా. డోజ్ విభాగం సాధ్యమైనంత పారదర్శకంగా పనిచేసేందుకు మేం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాం. వృథా ఖర్చులు, అనవసర నియామకాలను తగ్గించకపోతే అమెరికా దివాలా తీస్తుంది' అని మస్క్ తెలిపారు. ఏజెన్సీలలో వ్యర్థాల తొలగింపును, ప్రభుత్వాలలో మోసాలను అరికట్టడం వంటి చర్యలతో ఒక ట్రిలియన్ డాలర్లు అంటే లక్ష కోట్ల డాలర్లు పొదుపు చేయవచ్చని ట్రంప్, మస్క్ తెలిపారు. ఇది మొత్తం ఫెడరల్ వ్యయంలో దాదాపు 15శాతం ఉంటుందని చెప్పారు.
పోస్టల్ సేవలు మినహాయించి అమెరికాలో దాదాపు 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీరంతా వివిధ ఏజెన్సీలలో పనిచేస్తున్నారు. ఫెడరల్ శ్రామిక శక్తిలో భద్రతా సంబంధిత ఏజెన్సీలు ఎక్కువ భాగాన్ని కలిగి ఉన్నాయి. కానీ అమెరికా వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు మాజీ సైనికుల ఆరోగ్య సంరక్షణను, వ్యవసాయాన్ని పర్యవేక్షించడం, ప్రభుత్వ బిల్లులు చెల్లించడం వంటి ఇతర ఉద్యోగాలలో పనిచేస్తున్నారు.
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ఇప్పటికే ట్రంప్ బైఅవుట్ ప్యాకేజీతో ఆఫర్ ప్రకటించారు. దీని కింద ఫిబ్రవరి 6లోగా ఉద్యోగాలు స్వచ్ఛందంగా వదులుకున్న వారికి 8 నెలల జీతం ఇస్తానని చెప్పారు. ఈ అంశంలో ట్రంప్‌నకు ఇటీవల ఎదురుదెబ్బ తగిలింది. బైఅవుట్ ఆఫర్‌ను తాజాగా ఫెడర్‌ల్ కోర్టు న్యాయమూర్తి హోల్డ్ చేశారు. యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ కార్మికులను సెలవుపై ఉంచే ట్రంప్ ప్రయత్నాలను కూడా నిలిపివేశారు. అమెరికా ఖజానాలో సున్నితమైన చెల్లింపు వ్యవస్థలకు మస్క్ యాక్సెస్‌ను ఫెడరల్ కోర్టు నిలిపివేసింది.