Revenue Through Liquor Price Hike : తెలంగాణ రాష్ట్రంలో బీరు ధరలు పెంపు వల్ల ఏడాదికి రూ.1500 నుంచి 2000 కోట్లు అదనపు రాబడి వస్తుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. 2024లో జరిగిన మొత్తం బీరు కేసుల విక్రయాలను తీసుకున్నట్లయితే ఈ మేరకు వస్తుందని లెక్కలు కడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో రోజుకు రూ.100 కోట్లు విలువ చేసే లిక్కర్ అమ్ముడు పోతుండగా బీరు మాత్రం సగటున రోజుకు రూ.50 కోట్లు అదనంగా వస్తుందని ఆ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
రాష్ట్రంలో బీరుకు ఫుల్ డిమాండ్ : రాష్ట్రంలో బీరు తాగి చిల్ అయ్యే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ప్రధానంగా హైదరాబాద్ మహానగరం ఫార్మా, ఐటీ, రియల్ ఎస్టేట్ లాంటి పరిశ్రమలతోపాటు ఇతర పరిశ్రమలకు నిలయం. లక్షలాది మంది కార్మికులు ఉద్యోగులు ఇతర రాష్ట్రాల నుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చి బతుకుతున్నారు. దానికి తోడు మద్యం సేవించడం తెలంగాణ సంప్రదాయంలో ఒక భాగం. దాదాపు 20 లక్షల మంది యువత అటు ఫార్మా, ఇటు రియల్ ఎస్టేట్, ఐటీ రంగాలల్లో పని చేస్తుంటారు. దీంతో ఇక్కడ మద్యం విక్రయాలు అధికం.
రూ.2000కోట్ల ఆదాయం వస్తుందని అంచనా : అయితే బీరు తయారీకి ఉపయోగించే ముడి పదార్ధాల ధరలు పెరగడం 2019 నుంచి ధరలు పెంచకపోవడంతో తాజాగా రాష్ట్రంలో బీర్లు ధరలు పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.1500 కోట్ల నుంచి రూ.2000 కోట్ల వరకు అదనంగా ఆదాయం వస్తుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. 2024 క్యాలెండర్ ఏడాదిలో రూ.37,681 కోట్లు విలువైన 3,75,85,578 కేసులు లిక్కర్, 5,46,88,527 కేసులు బీరు అమ్ముడు పోయింది. ధరలు తీసుకుంటే బీర్ల ధర తక్కువ, లిక్కర్ ధర ఎక్కువ ఉంటుంది. దీంతో తక్కువ పరిమాణంలో లిక్కర్ అమ్ముడు పోయినప్పటికీ మూడొంతుల్లో రెండు వంతులు లిక్కర్ అమ్మకాలపై రాబడి వస్తుంది.
మద్యం అమ్మకాలు 10శాతం పెరిగే ఛాన్స్ : బీరు అమ్మకాలు అధికమైనా కూడా ఒక్క వంతు మాత్రమే బీరు ద్వారా రెవెన్యూ వస్తుంది. ఈ లెక్కన తీసుకుంటే బీరు విక్రయాలు వల్ల 2024 ఏడాదిలో దాదాపు రూ.12,500 కోట్లకుపైగా వచ్చి ఉంటుందని అబ్కారీ శాఖ అంచనా. అయితే ఈ మొత్తంపై 15 శాతం పెరిగిన బీరు ధరలతో రాష్ట్రానికి దాదాపు రూ.1900 కోట్లు అదనంగా వస్తుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేశారు. రోజువారీగా తాగే మద్యం ప్రియులకు పెరిగిన ధరలు ధరాభారమేనన్న విమర్శలు ఉన్నాయి. 2025 క్యాలెండర్ ఏడాదిలో మద్యం అమ్మకాలు తక్కువలో తక్కువ అనుకున్నా 2024 ఏడాది కంటే ఈ కనీసం 10శాతం మద్యం పెరుగుతాయి.
పరిమాణం పెరిగే కొద్దీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పెరుగుతుందని ఎక్సైజ్ అధికారులు తెలుపుతున్నారు. వచ్చేది వేసవి కాలం కావడంతో ఉద్యోగ, ఉపాది అవకాశాలు ఉండి రెండు చేతులా సంపాదించే యువత సాయంత్రం కాగానే రెండు బీర్లు తాగి చిల్ అవుతారు. కింగ్ ఫిషర్ తిరిగి మార్కెట్‌లోకి రావడంతో బీరు ప్రియుల ఆనందానికి హద్దూ లేకుండా పోయింది. లిక్కర్ తాగే వాళ్ల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. హైదరాబాద్ ఒక అంతర్జాతీయ విడది కేంద్రంగా ఎదుగుతున్నందున రానురాను మద్యానికి డిమాండ్ పెరుగుతుంది.
మందుబాబులకు ఊహించని షాక్ - పెరిగిన బీరు ధరలు - ఒక్కో బాటిల్‌పై ఎంతంటే?
కొత్త బీర్ బ్రాండ్లపై ఎక్సైజ్ శాఖ విచారణ - త్వరలో ప్రభుత్వానికి నివేదిక - TELANGANA BEER BRANDS NEWS