Bike Thift In Telangana : మన దినచర్యలో ద్విచక్ర వాహనం పాత్ర ఎంతో కీలకం. అడుగు బయట పెట్టాలంటే బండి ఉండాల్సిందే. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన బండ్లను జాగ్రత్తగా కాపాడుకుంటారు. కానీ ఆ బైక్ చోరీకి గురైతే గుండె ఆగినంత పనవుతుంది. అయితే నిజామాబాద్ జిల్లాలో ద్విచక్ర వాహన చోరీలు ఎక్కువయ్యాయి. ఏకంగా పోలీస్‌స్టేషన్ ముందున్న బైక్‌నే ఎత్తుకెళ్లారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఒక బైకు చోరీ అయితే రూ.లక్ష భారం పడుతోంది. ఇది పేద, మధ్య తరగతి వారిని కోలుకోకుండా చేస్తుంది.
పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనం చోరీ : నిజామాబాద్ తిర్మన్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి కుమారుడు ట్రిబుల్ రైడింగ్ కేసులో దొరికాడు. పోలీసులు చలానా వేసి వాహనాన్ని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎదుట పెట్టారు. మరుసటి రోజు చలానా కట్టి తమ వాహనం తీసుకెళ్దామంటే ఆ బండి మాయమైంది. పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనం ఎత్తుకెళ్లారంటే దొంగలు ఎంతకు తెగించారో తెలుస్తుంది.
మహారాష్ట్రకు తరలించి : దొంగతనాలు అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, దొంగలు మాత్రం తగ్గేదె లే అంటున్నారు. జల్సాలకు అలవాటుపడిన కొందరు యువకులు, దొంగిలించిన వాహనాలను మహారాష్ట్రలో అమ్మేస్తున్నారు. మరికొందరైతే విడిభాగాలు చేసి అవసరమైనవి అమ్ముతున్నారు. కొంతమంది దొంగతనం చేసిన వాహనంలోనే గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
2022-24 వరకు జిల్లాలో 1,291 ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. అందులో పోలీసులు పట్టుకున్నవి 676 బైక్‌లు మాత్రమే. మిగతా బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మన వాహనాలను రక్షించుకోవడానికి పోలీసులతో పాటు మనం కూడా జాగ్రత్తపడాలి. రూ.లక్షలు వెచ్చించి వాహనం కొనుగోలు చేస్తున్నాం. చిన్నపాటి ఖర్చుతో వాటిని రక్షించుకోవచ్చు.
బైక్ చోరీ కాకుండా ఇలా రక్షించుకుందాం :
- రూ.3 వేలతో జీపీఆర్‌ఎస్ : రూ.3 వేలు పెడితే జీపీఆర్‌ఎస్ ట్రాకింగ్ సిస్టం వస్తుంది. ఇది ఆన్‌లైన్‌లోనూ లభిస్తుంది. ఇందులో మొబైల్ సిమ్ వేసి మన చరవాణికి అనుసంధానం చేసుకోవచ్చు. దీని ద్వారా బైకు ఎక్కడికెళ్లినా గుర్తుపట్టొచ్చు. అనుమతి లేకుండా, ఎత్తుకెళ్లాలని చూసినా మొబైల్ ద్వారా వాహనాన్ని ఆగిపోయేలా చేయొచ్చు.
- పెట్రోల్ లాక్ : బైకుకు వచ్చే పెట్రోల్ సప్లై పైపు ఉంటుంది. ఇది కాకుండా ప్రత్యేకంగా ఓ లాక్ దొరుకుతుంది. దీనిని బిగిస్తే పెట్రోల్ చోరీ కాకుండా ఉండచ్చు. ఎవరైనా వాహనాన్ని చోరీ చేసినా మధ్యలోనే ఆగిపోతుంది.
- అదనపు లాక్ : ఎక్కడైనా బైక్ నిలిపితే టైరుకు అదనంగా ఓ లాక్ వేయాలి. ఇది వైరులా ఉంటుంది. దీనిని ఏర్పాటు చేసుకుంటే వాహనాన్ని ముందుకు కదిలించలేరు.
టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్ వీలర్‌కు పెంచుకోండి - ఫోన్లోనే ఈజీగా ఇలా!
Bike thieves in Hyderabad : ఖరీదైన బండి.. కనిపిస్తే మాయమండి!