Old City Metro Land Acquisition Cheques : పాతబస్తీ మెట్రో రైలు పనుల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న యజమానులకు ప్రభుత్వం పరిహారం అందజేస్తుంది. అందుకు సంబంధించిన చెక్కుల పంపిణీ నేటి నుంచి ప్రారంభం కానుంది. మెట్రో రెండో దశలోని కారిడార్-6ను ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్నారు. ఈ మెట్రో మొదటి దశలోనే పూర్తి చేయాల్సి ఉండగా, ఆస్తుల సేకరణ, అలైన్‌మెంట్ వివాదాలతో పదేళ్లుగా ఆగిపోయింది. దీంతో రెండో దశలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
భూసేకరణ ప్రక్రియ వేగవంతం : దీనికి అవసరమైన రైట్ ఆఫ్ వే కోసం ముందుగా రహదారులు విస్తరించాలి. సర్వే చేపట్టగా 1100 ఆస్తులను సేకరించాల్సి ఉంటుందని అధికారులు గుర్తించారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లలో రోడ్ల విస్తరణ, స్టేషన్ల నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్లు విడతల వారీగా జారీ చేశారు. చదరపు గజానికి రూ.81 వేలుగా పరిహారం ఇవ్వడానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నిర్ణయించారు.
169 మంది సమ్మతిస్తూ పత్రాలు : లక్డీకాపూల్‌లోని మధ్యాహ్నం 2 గంటలకు పరిహారం చెక్కుల పంపిణీ జరుగుతుందని హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రోరైలు లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 169 మంది సమ్మతి తెలుపుతూ ప్రత్రాలిచ్చారని తెలిపారు. తొలుత 40 మందికి చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హాజరవుతారని తెలిపారు. సీఎం ఆదేశాలతో త్వరిగతిన మెట్రో పనులు చేపట్టేలా సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
ప్యారడైజ్- మేడ్చల్ మెట్రో : మరోవైపు హైదరాబాద్ ఉత్తర భాగం నగరవాసుల మెట్రో రైల్ కల త్వరలో సాకారమయ్యే దిశగా అడుగులు పడబోతున్నాయి. భాగ్యనగర నార్త్ సిటీ వాసులకు నూతన సంవత్సర కానుకగా సీఎం రేవంత్‌రెడ్డి ప్యారడైజ్- మేడ్చల్ 23 కిలోమీటర్లు, జేబీఎస్-శామీర్‌పేట్ 22 కిలోమీటర్ల రెండు మెట్రో కారిడార్ల డీపీఆర్(వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక)ల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
హైదరాబాద్ వాసులకు శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం - మేడ్చల్, శామీర్‌పేట్‌కు మెట్రో పొడిగింపు
గజానికి రూ.81 వేల పరిహారం - పాతబస్తీ మెట్రోకు ఆస్తుల సేకరణ షురూ