Hanuman Vadamala Significance In Telugu : ఆంజనేయస్వామికి వడమాల వేయడం ఆనవాయితీ. ఎన్నో రోజులుగా ఇది సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా అసలు హనుమకు వడమాల అంటే ఎందుకంత ఇష్టం? హనుమకు వడమాల వేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
వడమాల వెనుక పురాణగాథ
ఆంజనేయుడు కార్యసిద్ధిని, శత్రు జయాన్ని కలిగిస్తాడని ప్రతీతి. కోరిన కోర్కెలు తీర్చే ఆంజనేయునికి భక్తులు భక్తితో వడమాల సమర్పిస్తారు. దక్షిణ భారతదేశంలో హనుమంతుని ఆలయాల్లో వడమాల నైవేద్యం ప్రసిద్ధి చెందింది. అయితే ఇలా వడలను స్వామికి నైవేద్యంగా సమర్పించడం వెనుక పురాణ కథ ఉంది.
భానుని ఫలమని తలచి!
హనుమంతుడు చిన్నతనంలో ఎర్రని పండులా కనిపించే బాల భానుడి చూసి, అది తినే వస్తువుగా భావించి ఇష్టపడి, సూర్యుడిని పట్టుకోవడానికి ఆకాశంలో ఎగురుతూ వెళ్తున్నాడు. అది సూర్య గ్రహణ సమయం. ఆ సమయంలో రాహు గ్రహం గ్రహణం కోసం సూర్యుడిని పట్టుకోవడానికి వస్తున్నాడు. రాహువు, హనుమంతుడు ఒకే సమయంలో సూర్యుడి వైపు పయనించడం మొదలు పెట్టినా, వాయువేగంతో హనుమంతుడు ముందుగా సూర్యుని చేరుకున్నాడు. రాహువుపై గెలిచాడు.
హనుమకు రాహువు వరం
బాల హనుమంతుని శౌర్యం చూసిన రాహువు హనుమంతుడిని మెచ్చుకున్నాడు. అంతేకాదు హనుమంతుడికి ఒక వరం ఇచ్చాడు. హనుమంతుని పూజించే వారు రాహువుకు ఇష్టమైన మినప పప్పుతో చేసిన ఆహరాన్ని హనుమకు నైవేద్యంగా సమర్పిస్తే రాహు దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని వరమిచ్చాడు.
పాము రూపంలో!
హనుమకు అలా సమర్పించే మినప పప్పు ప్రసాదం ఎలా ఉండాలో కూడా రాహువు వివరించాడు. అది పాములా అంటే తన శరీర భాగంలా ఉండాలని రాహువు హనుమంతుడికి వివరించాడు. అందుచేతనే హనుమకు సమర్పించే గారెలు మాలగా చేసి సమర్పించే ఆనవాయితీ వచ్చింది. అందుకనే హనుమాన్ ఆలయాల్లో భక్తులు వడమాలలను సమర్పిస్తారు. అయితే ఈ వడమాలలోని ఎన్ని వడలు ఉండాలన్న సంఖ్యకు ఎలాంటి నియమాలు లేవు.
చేపట్టిన పనుల్లో విజయం సాధించాలన్నా, వివాహప్రాప్తి, ఉద్యోగం, శత్రుజయం ఇలా ఎంత కష్టమైన సమస్య అయినా హనుమకు వడమాల సమర్పిస్తామని మొక్కుకుంటే పరిష్కారం లభిస్తుంది. అయితే హనుమకు సమర్పించిన వడమాల ప్రసాదాన్ని అందరికీ పంచి పెడితేనే ఆ ఫలితం పూర్తిగా దక్కుతుందని శాస్త్ర వచనం. జై శ్రీరామ్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.