CM Revanth Reddy Comments On Caste Census : కులగణనలో వివరాలు నమోదు చేసుకోకపోతే మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులకు సామాజిక బహిష్కరణ శిక్షే అని, వారి ఇంటి ముందు మేలుకొలుపు డప్పులు కొట్టాలని బీసీ సంఘాలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జనాభా లెక్కలు చెప్పని కేసీఆర్‌కు తెలంగాణలో జీవించే హక్కు లేదని పేర్కొన్నారు. కులగణన సర్వే రెండో విడత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించిన కులగణన, ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో ముఖ్యంత్రి ప్రసంగించారు.
బీసీల జనాభా 56.33 శాతం ఉంది : ఎలాంటి పొరపాట్లు జరగకుండా పటిష్టంగా, శాస్త్రీయంగా కులగణన సర్వే చేయించామని, ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిపై విపక్షం దుష్ప్రచారం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు కేటగిరీల కింద కులగణన సర్వే వివరాలు సేకరించామని, కులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల జనాభా 56.33 శాతం ఉందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలి : కొందరు ఆరోపిస్తున్నట్టు కులగణన సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని, ఇప్పుడు కులగణన సర్వేను తప్పు పడితే బీసీలు శాశ్వతంగా నష్టపోతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశం మొత్తం కూడా కులగణన సర్వే జరగాలని పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీని రాహుల్‌గాంధీ నిలదీశారని, ఈ సర్వే జరగకూడదని మోదీ, కేసీఆర్ కలిసి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. నరేంద్రమోదీ పుట్టుకతో బీసీ కులస్థుడు కాదని, గుజరాత్ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీ జాబితాలో చేర్చుకున్నారని ఆరోపించారు. సర్టిఫికెట్ ప్రకారం మాత్రమే మోదీ బీసీ వ్యక్తి అని, ఆయన వ్యక్తిత్వం మాత్రం అగ్ర కులమని అన్నారు. కులగణన జరిగితే చట్ట ప్రకారం రిజర్వేషన్లు సాధించుకోవచ్చని వెల్లడించారు. అధికారిక లెక్కలు ఉంటే బీసీల రిజర్వేషన్లు పెంచాలని సుప్రీంకోర్టు కూడా చెప్పొచ్చని పేర్కొన్నారు. జనాభా లెక్కలు జరిగేటప్పుడు కేంద్ర ప్రభుత్వం కులగణన కూడా చేయాలని కోరారు.
కార్యకర్తగా మిగిలేందుకు సిద్ధం : తాను ఆఖరి రెడ్డి సీఎంను అయినా ఫర్వాలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. తమ నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టేందుకు క్రమక్షశిణ కలిగిన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నానని ఇది తన నిబద్ధత అని, కులగణన తన కోసం, తన పదవి కోసం చేయలేదని అన్నారు. త్యాగానికి సిద్ధపడే కులాల లెక్కలు పక్కాగా తేల్చామని, తమ నాయకుడి ఆదర్శం నిలబెట్టేందుకు తాను కార్యకర్తగా మిగిలేందుకు సిద్ధమని అన్నారు.
"కొందరు ఆరోపిస్తున్నట్లు కులగణన సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగలేదు. ఇప్పుడు కులగణన సర్వేను తప్పు పడితే బీసీలు శాశ్వతంగా నష్టపోతారు. నేను ఆఖరి రెడ్డి ముఖ్యమంత్రిని అయినా ఫర్వాలేదు. మా నాయకుడి ఆదర్శం నిలబెట్టేందుకు నేను కార్యకర్తగా మిగిలేందుకు సిద్ధం. మా నాయకుడికి ఇచ్చిన మాట నిలబెట్టేందుకు సామాన్య కార్యకర్తగా ఉంటా. ఈ సర్వేను నా కోసం చేయలేదు, ఏ త్యాగానికైనా సిద్ధం." - రేవంత్ రెడ్డి, సీఎం
ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి