Indiramma Houses To Be Allotted In January : ఈ సంవత్సరం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున మంజూరు చేస్తూ, రానున్న నాలుగు సంవత్సరాల్లో అర్హులందరికీ గృహాలను నిర్మించే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యంత నిరుపేదలను పారదర్శకంగా గుర్తించి, వారికి జనవరి 31లోగా మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసాతో పాటు రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 3 పథకాలను అమలు చేయనున్నామని తెలిపారు.
ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు కేటాయించిన 112 విద్యుత్తు బస్సుల్లో 50 వాహనాలను హనుమకొండలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం ప్రారంభించారు. దీంతో పాటు పలు అభివృద్ధి పనులు, సమీక్ష కార్యక్రమాలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
65 లక్షల మంది వివరాలను యాప్‌లో నమోదు చేశాం : రాజకీయాలకతీతంగా అందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం అపరిష్కృతంగా వదిలేసిన 1.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి అర్హులకు అందిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు 80 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పటికే 65 లక్షల మంది వివరాలను యాప్‌లో నమోదు చేశామని వెల్లడించారు. టీజీఎస్ఆర్టీసీని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. సంక్రాంతిలోపు రెండో విడతలో మరిన్ని ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించబోతున్నామని తెలిపారు.
పొంగులేటి జోస్యం : అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా, ప్రతిపక్షం తీరు మారడం లేదని పొంగులేటి బీఆర్‌ఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి వచ్చి సూచనలు, సలహాలు ఇవ్వమంటే సభకు రాకుండా అల్లరి చేసే వారిని పంపారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వారికి గుండు సున్నానే వస్తుందని జోస్యం చెప్పారు.
21 శాతం పీఆర్‌సీ ఇచ్చాం : మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు టీజీఎస్ఆర్టీసీలో 125 కోట్ల మంది ప్రయాణికులు రూ.4350 కోట్ల విలువైన ఉచిత ప్రయాణం చేశారని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులకు 2013కు సంబంధించిన బాండ్లు, 21 శాతం పీఆర్‌సీ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు.
సర్వే ముగిసింది - ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? - అయోమయంలో ఇందిరమ్మ ఇళ్ల అర్హులు
'మా పేరు ఎందుకు రాలేదు సార్'? - ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో కనిపించని అర్హుల పేర్లు!