How To Do Shiva Linga Abhishekam : వ్యాస మహర్షి రచించిన శివ పురాణం ప్రకారం పరమశివుడికి చేసే అభిషేకం జన్మజన్మల పాపాలను కడిగేస్తుంది. అనంతమైన పుణ్యఫలాలను అవలీలగా అందిస్తుంది. పరమ శివుడు అభిషేక ప్రియుడు. సాధారణంగా శివుని పంచామృతాలతోను పండ్ల రసాలతోను అభిషేకం చేస్తుంటారు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె పంచదారను పంచామృతాలని అంటారు.
పంచామృతాభిషేక ఫలం
పంచామృతాలతో చేసే అభిషేకంతో పరమశివుని అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఇక ఈ ఐదింటిలో ఒక్కో అభిషేక ద్రవ్యంతో చేసే అభిషేకం ఒక్కో విశేషమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది.
ఆవు పెరుగుతో ఆరోగ్యం
శివాభిషేకం లో వాడే అభిషేక ద్రవ్యాలలో ఆవుపెరుగు ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఆవు పెరుగుతో శివుడిని అభిషేకించడం వలన 'ఆరోగ్యం' కలుగుతుందని విశ్వాసం. అనారోగ్యాలు దరిచేరకుండా ఉండటం కోసం ఆ స్వామిని ఆవు పెరుగుతో అభిషేకిస్తూ ఉండాలి.
పెరుగుతోనే శివలింగం
సిరిసంపదలు కోరుకునేవారు ఆవు పెరుగును ఒక వస్త్రంలో ఉంచి మూటకట్టి దానిలోని నీరంతా పోయేలా పిండి, ఆ వస్త్రంలో మిగిలిపోయిన మెత్తటి పదార్థంతో శివలింగం తయారు చేసి పూజించాలని పురాణాలు చెబుతున్నాయి. అలా పెరుగు నుంచి వచ్చిన మెత్తటి పదార్థంతో శివలింగం తయారు చేసుకుని దానిని పూజించడం వలన సిరిసంపదలు కలుగుతాయని శాస్త్రవచనం.
దారిద్య్ర దుఃఖ దహనాయ నమః శివాయ
దారిద్య్రం నుంచి, దాని వలన కలిగే దుఃఖం నుంచి విముక్తిని పొందాలనుకునేవారు, ఇలా పెరుగు నుంచి వచ్చే మెత్తటి పదార్థంతో శివలింగం తయారుచేసుకుని పూజించడం వలన జన్మాంతర దారిద్య్రం తొలగిపోయి, సిరిసంపదలతో తులతూగుతారు. ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.