Father Murdered his Daughter : ఓ తండ్రి తన కూతురిని వ్యవసాయ బావిలోకి తోసేసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో రాయికోడ్ పోలీసులు ఆ కసాయి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడు మండలం సంగాపూర్కు చెందిన సతీష్ అనే వ్యక్తి ఈనెల 9న తన కూతురు వైష్ణవి(11)ని గ్రామ పొలిమేరలోని వ్యవసాయ బావిలోకి తోసేసి హత్య చేశాడు. 16వ తేదీన ఆ బావిలో వైష్ణవి మృతదేహం కనిపించడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అనుమానంతో పోలీసుల విచారణ : మృతురాలు వైష్ణవి నానమ్మ ఫిర్యాదుతో తండ్రి సతీష్‌ను పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా కూతురును తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. కుటుంబ కలహాలతో సతీష్ భార్య పిల్లలను, అతడిని వదిలేసి వెళ్లిపోయింది. భార్య తనను వదిలివెళ్లిందన్న కక్షతోనే కూతురును హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు వెల్లడించారు. నిందితుడు సతీష్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
సతీష్ ఎక్కువగా మద్యానికి బానిసై ఇంట్లో తరచూ తన భార్యతో గొడవ పడుతుండేవాడని సంగాపూర్ గ్రామస్థులు చెబుతున్నారు. నెల రోజుల క్రితం సతీష్ చిన్న కూతురు కూడా అనుమానాస్పద స్థితిలోనే చనిపోయింది. ఆ చిన్నారిని కూడా సతీష్ హత్య చేసి ఉంటాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
"సతీష్ భార్య వదిలి వెళ్లిపోయిందని, తన పరువు పోయినట్లు భావించాడు. ఆమెకు సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడా కనిపించకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. దాని ప్రకారమే వైష్ణవి అనే తన పెద్ద కూతురుని జనవరి 9వ తేదిన సంగాపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో తోసేసి హత్య చేశాడు. అనంతరం ఏమి తెలియనట్లు ఇంటికి వచ్చి ఉంటున్నాడు. ఆ పాప కనిపించడం లేదంటూ తన నాయనమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. వెంటనే దర్యాప్తు చేపట్టాం. సతీష్‌పై అనుమానం రావడంతో విచారణ చేయగా నేరం ఒప్పుకున్నాడు. వెంటనే కేసు నమోదు చేసి రిమాండుకు తరలించాం" హనుమంతు, జహీరాబాద్ రూరల్, సీఐ
ఆ ఒక్క ఫోన్ కాల్తోనే జంట హత్యలు! - రోడ్డున పడ్డ ముగ్గురు పిల్లలు
కుమార్తెతో అసభ్య ప్రవర్తన - భర్తను రోకలి బండతో కొట్టి చంపిన ఇద్దరు భార్యలు