Karma Phalam : జన్మించిన ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఎన్నో పనులు చేస్తుంటారు. వీటిల్లో మంచి చెడు కలిసి ఉంటాయి. అయితే మంచైనా, చెడైనా ఆ కర్మఫలాన్ని మాత్రం తప్పకుండా అనుభవించి తీరాల్సిందే. ఇందులో ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఉండదు. దేవుడైన సరే మానవ జన్మ స్వీకరించాక కర్మఫలాన్ని అనుభవించక తప్పదని తెలియజేసే ఓ కథను ఈ కథనంలో తెలుసుకుందాం.
దేవకీ దేవి ధర్మ సందేహం
పోతన రచించిన భాగవతంలోని ఓ సంఘటన చూస్తే కర్మఫలం ఎంతో గొప్పదో, ఎంతటి వారైనా కర్మఫలం నుంచి ఎలా తప్పించుకోలేరో అర్ధం అవుతుంది. తన మేనమామ కంసుని శ్రీకృష్ణుడు సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవులకు కారాగారం నుంచి విముక్తి కలిగిద్దామని వారి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో దేవకీ మాత కృష్ణుని చూసిన వెంటనే "నాయనా! నువ్వే పరమాత్మునివి కదా! నీకు ఇన్ని దైవిక శక్తులు ఉంటాయి అయినా నువ్వు కంసుని సంహరించి, మమ్మల్ని కారాగారం నుంచి విడిపించడానికి ఎందుకు 14 సంవత్సరాలు ఆగావు అని అడిగింది?
దేవకీ సందేహానికి కృష్ణుని వివరణ
తనకు ప్రశ్నించిన తన తల్లి దేవకీ దేవిని చూసి శ్రీకృష్ణుడు నమస్కరిస్తూ "అమ్మా! గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం లేదు కానీ నేను నీకు ఇప్పుడు గుర్తు చేస్తున్నాను విను అంటూ ఇలా అన్నాడు. "తల్లి నన్ను క్షమించు నీవు గత జన్మలో నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు పంపావు. ఆ కర్మ ఫలమే ఇది" అన్నాడు. అప్పుడు దేవకీదేవి ఆశ్చర్యపోయి "కృష్ణా ఇది ఎలా సాధ్యం? నేనెందుకు నిన్ను అడవులకు పంపుతాను అదీ 14 ఏళ్ళు నువ్వెందుకు అలా అంటున్నావు" అని అడిగింది.
దేవకికి గత జన్మ గుర్తు చేసిన శ్రీకృష్ణుడు
అప్పుడు శ్రీకృష్ణుడు మందహాసంతో "తల్లీ గతజన్మ అంటే త్రేతా యుగంలో నేను రామావతారంలో ఉన్నప్పుడు నువ్వు కైకేయివి. నా తండ్రి దశరథ మహారాజును నీవు రెండు వరాలు కోరి నన్ను 14 ఏళ్ళు అరణ్యాలకు పంపావు" అని అన్నాడు కృష్ణుడు. అది విని దేవకీదేవి ఎంతో ఆశ్చర్యంతో, కుతూహలంతో 'అయితే ఈ జన్మలో కౌసల్య ఎవరు?' అడిగింది.
యశోదయే కౌసల్య!
అప్పుడు కృష్ణుడు తన తల్లికి సమాధానం చెబుతూ "అమ్మా! త్రేతా యుగంలో కౌసల్యాదేవి నేటి ద్వాపర యుగంలో యశోద మాతగా జన్మించింది. ఆ యుగంలో 14 సంవత్సరాలు దూరమైన తల్లి ప్రేమను ఆమె ఈ జన్మలో తిరిగి పొందింది. ఆమెకు తల్లి ప్రేమ దూరం చేసిన పాపఫలాన్ని 14 సంవత్సరాలు నువ్వు చెరసాలలో నాకు దూరంగా ఉండి అనుభవించాల్సి వచ్చింది. ఎంతటి వారైనా కర్మ ఫలాలను అనుభవించక తప్పదు. అవతార పురుషులైనా, మానవులైన కర్మఫలం నుంచి తప్పించుకోలేరు. అందుకే కంస సంహారానికి మీ చెరసాల విముక్తికి 14 ఏళ్ళు సమయం పట్టిందని" కృష్ణుడు దేవకీదేవికి వివరించాడు.
కర్మఫలాన్ని అనుభవించడం ఆ దేవతలకే తప్పలేదు. ఇక మానవ మాత్రులం మనకు ఎలా తప్పుతుంది? ఎవరైనా సరే కర్మను అనుభవించక తప్పదు. అందుకే చేసే పనులు, చెప్పే మాటలు మంచివై ఉండాలి. మంచి చేయలేకపోతే ఫర్వాలేదు కానీ ఎవరికీ ఎన్నడూ చెడు తలపెట్టకూడదు. ఆ పాపఫలం ఎన్ని జన్మలెత్తినా వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటి కథలు తెలుసుకొని మంచి మార్గంలో పయనించాలన్న ఆకాంక్ష అందరిలో కలిగించడమే ఈ కథనం ముఖ్య ఉద్దేశ్యం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.