Govt Focus On radial roads between ORR and RRR : ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్), బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్) మధ్య 11 రేడియల్ రోడ్ల నిర్మాణానికి సర్కారు అడుగులు వేస్తోంది. ఈ రోడ్లను భూసేకరణ చేసి కొత్తగా(గ్రీన్‌ఫీల్డ్) నిర్మించాలని అనుకున్నప్పటికీ, వివిధ సమస్యల నేపథ్యంలో అవకాశం ఉన్నచోట పాత రహదారులనే (బ్రౌన్‌ఫీల్డ్) రేడియల్ రోడ్లుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల ఈ అంశంపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
ఇబ్బందులు ఇలా : ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్లకు మధ్యలో కొన్నిచోట్ల గ్రామాలు, పట్టణాలు రావడం, రహదారుల డిజైన్‌లో సాంకేతిక సమస్యలు, మరికొన్ని చోట్ల భూసేకరణలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉండటాన్ని అధికారులు ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే నేషనల్ హైవేలు, ఓఆర్‌ఆర్, పరిశ్రమల అభివృద్ధికి పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టారు. మళ్లీ కొన్నిచోట్ల భూసేకరణ అంటే స్థానికుల నుంచి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అవకాశం ఉన్నచోట బ్రౌన్‌ఫీల్డ్ రహదారులను అనుసంధానం చేసే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది.
సుమారు 300 కి.మీ.కు పైగానే : ఈ 11 రేడియల్ రోడ్ల మొత్తం పొడవు 300 కిలోమీటర్లకు పైగానే ఉండనుంది. దీని కోసం వెయ్యి ఎకరాలకుపైగా భూసేకరణ చేయాల్సి ఉంటుందని అంచనా. మధ్యలో ఫారెస్ట్ భూములున్నాయి. బాహ్యవలయ రహదారి ఎగ్జిట్ 2, 4, 8, 10, 13, 15 నంబర్లతోపాటు ఇతర ప్రాంతాల నుంచి గ్రీన్‌ఫీల్డ్ రోడ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇప్పటికే కొన్నిచోట్ల భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఆర్‌ఆర్‌ఆర్(రీజనల్ రింగ్ రోడ్డు) ఉత్తర భాగానికి (161.59 కిలోమీటర్లు) ఎన్‌హెచ్‌ఏఐ(నేషనల్ హైవే ఆఫ్ ఇండియా) ఇటీవలే టెండర్లు పిలిచింది. 189 కిలోమీటర్లు దక్షిణ భాగం నిర్మాణానికి డీపీఆర్ రూపకల్పనకు కన్సల్టెన్సీ సంస్థ కోసం సర్కారు రెండోసారి టెండర్లు పిలిచింది. ఈ భాగాన్ని కూడా నిర్మించడానికి కేంద్రం ఆసక్తిగా ఉంది. దీనిపై స్పష్టత వచ్చేంతలోపు రేడియల్ రోడ్లను పూర్తి చేయడంపై సర్కారు దృష్టిసారించింది. ఆర్‌ఆర్‌ఆర్, ఓఆర్‌ఆర్ మధ్య ఫ్యూచర్ సిటీ అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగంలో 11 ఇంటర్‌ఛేంజ్‌లు - జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం!
ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి టెండర్లు పిలిచిన కేంద్రం - ఆ కండీషన్ మాత్రం తప్పనిసరి