Trump On H1B Visa : హెచ్1బీ వీసాపై రిపబ్లికన్ పార్టీలో వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి చట్టబద్ధమైన వలసలకు మద్దతు ఇస్తుంటే ఇతర నేతలు మాత్రం అమెరికా ఫస్ట్ విధానానికి కట్టుబడి ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా తనకు రెండు వైపుల వాదనలు కూడా నచ్చాయన్నారు ట్రంప్. సమర్థవంతమైన ప్రజలు అమెరికాలోకి రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఈ మేరకు వైట్‌హౌస్‌లో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఆ అంశంపై తనకు రెండు వైపుల వాదనలు కూడా నచ్చాయని చెప్పారు. కేవలం ఇంజనీర్ల గురించి మాత్రమే తాను మాట్లడటం లేదని అన్నారు. అన్ని స్థాయిల వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని మాట చెబుతున్నట్లు అన్నారు. దేశ వ్యాపారాలను విస్తరింపచేసేందుకు తమకు సమర్థవంతమైన, నైపుణ్యం కలిగిన వ్యక్తులు కావాలని, అది హెచ్1బీ వీసాతో సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అందుకే తాను రెండు వాదనలనూ సమర్థిస్తున్నట్లు చెప్పారు.
అర్హత కలిగిన సాంకేతిక నిపుణులు అమెరికాకు వచ్చేందుకు హెచ్1బీ వీసా ఉపయోగపడుతోందని ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి పేర్కొన్నారు. అయితే, ఆ విషయంపై రిపబ్లికన్ పార్టీకి చెందిన నిక్కీహేలీ భిన్నమైన వాదనను వినిపించారు. "నేను సౌత్ కరోలినా గవర్నర్‌గా పనిచేసిన సమయంలో నిరుద్యోగిత రేటు 11 శాతం నుంచి 4 శాతానికి పడిపోయింది. విదేశీ ఉద్యోగులను కాకుండా పెట్టుబడులను మాత్రమే ఆహ్వానించాం కాబట్టే అది సాధ్యమైంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రజలకు శిక్షణ ఇవ్వడం వల్ల వారు ఇప్పుడు విమానాలు, ఆటోమొబైల్స్ తయారీలో రాణిస్తున్నారు. సాంకేతిక రంగాన్ని బలోపేతం చేయాలని భావిస్తే ముందు విద్యారంగంపై దృష్టిసారించాలి. అంతేకానీ అమెరికన్లను తక్కువ అంచనా వేయొద్దు" అని స్పష్టంగా తన అభిప్రాయాన్ని వినిపించారు.
ప్రత్యేక నిపుణులైన విదేశీయులను మరింత తేలిగ్గా నియమించుకొనేందుకు అమెరికా కంపెనీలకు అవకాశం కల్పిస్తూ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కార్యవర్గం పలు నిబంధనల్లో మార్పులు చేసింది. దీంతోపాటు సులువుగా ఎఫ్-1 విద్యార్థి వీసాలను హెచ్-1బీ వీసాలుగా మార్చుకొనే అవకాశం కల్పించింది. ఇది లక్షల మంది భారతీయ వృత్తి నిపుణులకు ప్రయోజనం కల్పించనుంది. ఈ వీసా నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి వస్తుంది. టెక్నాలజీ కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను దీని సాయంతో నియమించుకుంటున్నాయి. ముఖ్యంగా భారత్, చైనా దేశాలు ఈ వీసా నుంచి చాలా ప్రయోజనం పొందుతున్నాయి.
ఇకపై పాఠశాలలు, చర్చిలలోనూ అక్రమ వలసదారుల అరెస్టు!
మరోవైపు, చర్చిలు, పాఠశాలల్లో అక్రమ వలసదారులు ఉంటే అటువంటి సున్నిత ప్రాంతాల్లో వారిని అరెస్టు చేయకూడదనే గత నిబంధనను తొలగించింది. ట్రంప్ ప్రభుత్వం. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అధికారులు పాఠశాలలు, ప్రార్థనా స్థలాల్లోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. హంతకులు, రేపిస్టులను పట్టుకోవడానికి తాజా ఉత్తర్వులు దోహదపడతాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ పేర్కొంది.