Cheques Writing With Black Ink : "చెక్కులపై నలుపు ఇంక్‌తో రాయడాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిషేధించింది" అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. కొంతమంది అందులోని సమాచారం నిజమేనని భావిస్తున్నారు. కానీ వాస్తవం వేరు. చెక్కులపై నలుపు ఇంక్‌తో రాయడంపై ఆర్‌బీఐ ఎలాంటి నిషేధం విధించలేదు.
అవన్నీ రూమర్సే: కేంద్రం
ఈమేరకు స్పష్టత ఇస్తూ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కూడా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. చెక్కులపై రాతలకు ఇక బ్లాక్ ఇంక్ వాడొద్దంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించింది. అటువంటి ఆదేశాలను ఆర్‌బీఐ జారీ చేయలేదని పీఐబీ తేల్చి చెప్పింది. ఇలాంటి సమాచారంతో కూడిన పోస్ట్‌లు వైరల్ అయిన సమయాల్లో సంబంధిత ప్రభుత్వ పోర్టల్స్‌ను కచ్చితంగా చూడాలని నెటిజన్లను కోరింది.
చెక్కుపై ఏమేం రాయాలి ?
చెక్కు అనేది రాతపూర్వక దస్తావేజు. మనం ఎవరికైతే డబ్బును ఇవ్వదలిచామో వారి పేరు చెక్కుపై రాయాలి. ఎంత మొత్తాన్ని ఇవ్వాలనేది కూడా స్పష్టంగా అంకెల్లో, పదాల్లో ప్రస్తావించాలి. డబ్బులు సంబంధిత వ్యక్తి ఖాతాలో ఎప్పుడు జమకావాలి అనే తేదీని కూడా చెక్కుపై వేయాలి. వ్యాపార లావాదేవీల కోసం, రుణాల మంజూరు ప్రక్రియలో, ఉద్యోగుల వేతనాల చెల్లింపు కోసం, పెద్దస్థాయి నగదు బదిలీ కోసం చెక్కులను వినియోగిస్తుంటారు.
ఏ ఇంక్‌తో రాయాలి ?
చెక్కు రాయడానికి ఏ ఇంకును వినియోగించాలి? అనే దానిపై ఇప్పటి వరకు ఆర్‌బీఐ నిర్దిష్ట నిబంధనలేవీ జారీ చేయలేదు. చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్) ద్వారా బ్యాంకుల్లో చెక్కుల లావాదేవీలు జరుగుతుంటాయి. చెక్కుపై రాసిన వివరాలను దిద్దినా, మార్చినా వాటిని బ్యాంకులు స్వీకరించవు. మళ్లీ కొత్తగా దిద్దుబాట్లు లేకుండా నీట్‌గా రాసిన చెక్కును మాత్రమే సీటీఎస్ వ్యవస్థ ద్వారా ప్రాసెస్ చేస్తారు. ఒకవేళ దిద్దిన చెక్కులను బ్యాంకులు స్వీకరిస్తే ఆర్థిక మోసాలు జరిగే ఆస్కారం ఉంటుంది. వాటికి తావు ఇవ్వకుండా బ్యాంకులు జాగ్రత్త వహిస్తుంటాయి.