Adilabad Suicide Case : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఉమ్‌డం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ కుటుంబం మొత్తం అప్పుల వేదన భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. దానిలో భాగంగానే పురుగుల మందు తాగి రాకేశ్(40), ఆయన మేన మరదలు(17) మృతి చెందారు. వివరాల్లోకి వెళితే తమ సొంతూళ్లునే వ్యవసాయం చేస్తూ ఆకుల రాకేశ్ అనే వ్యక్తి ఆదిలాబాద్‌లో క్రిమిసంహారక మందుల దుకాణం నడుపుతున్నారు. తనకు భార్య లావణ్య, పదేళ్ల వయస్సున్న కూతురు ఉన్నారు. ఏఎన్‌ఎం శిక్షణ తీసుకొన్న రాకేశ్ మేనమామ కూతురు వారి వద్దే ఉంటోంది. ఆమెకు తల్లి, తండ్రి లేరు. వీరంతా కలిసి ఈరోజు ఆత్మహత్య చేసుకోవడానికి పొలానికి వెళ్లారు.
అప్పుల బాధతోనే ఆత్మహత్యకు ప్లాన్ : రాకేశ్ వేర్వేరు వ్యక్తుల వద్ద సుమారుగా రూ.60 లక్షలు అప్పుచేశాడు. ఆ డబ్బులను తమకు తెలిసిన రాకేందర్‌కు అప్పుగా ఇచ్చారు. రాకేశ్‌కు అప్పు ఇచ్చిన వ్యక్తులు డబ్బులను అడుగుతుండడంతో, ఇతను రాకేందర్‌ను అడిగాడు. రాకేందర్ వాయిదాలు వేస్తూ వచ్చాడు. దీంతో రాకేశ్ కుటుంబం తీవ్రమైన మనోవేదనకు గురయ్యింది. దీంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్రణాళిక ప్రకారమే రాకేశ్, అతని భార్య, మేన మరదలు పురుగుల మందు తాగారు.
ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి : కూతురు ఫోన్‌లో మాట్లాడుతుండానే రాకేశ్, ఆయన భార్య, మేనమరదలు తమ వెంట తీసుకొచ్చిన పురుగుల మందు తాగారు. వీరిని కొంతమంది స్థానికులు చూసి ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలిస్తుండగానే రాకేశ్, ఆయన మేన మరదలు ప్రాణాలు విడిచారు. రాకేశ్ భార్య లావణ్య అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమెకు వైద్యులు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.
"రోజు ఉమ్‌డంకు చెందిన ఆకుల రాకేశ్, అతని మేనమామ కూతురు వారి వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగారు. అనంతరం ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయినట్లు తెలిసింది. వారిద్దరి మరణానికి గల కారణాలు ఏమిటని విచారణ చేస్తున్నాం. విచారణలో మరణానికి గల కారణాలు తెలుస్తాయి" -సీఐ ఫణిదర్, ఆదిలాబాద్ రూరల్
ఆ పరిచయమే బలితీసుకుందా? - వీడని ఎస్సై, కానిస్టేబుల్, ఆపరేటర్ డెత్ మిస్టరీ