Madhagajaraja Telugu Release : కోలీవుడ్‌లో సంక్రాంతి బరిలో దిగిన హీరో విశాల్ 'మదగజరాజ' హిట్‌టాక్ సొంతం చేసుకుంది. 2013లోనే పూర్తైన ఈ సినిమా, ఎట్టకేలకు 12ఏళ్ల తర్వాత రిలీజైంది. జనవరి 12న తమిళ్‌లో రిలీజైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఒక్క తమిళంలోనే రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే జనవరి 31న తెలుగు వెర్షన్ కూడా రిలీజైంది.
అయితే తెలుగు మార్కెట్‌లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని భావించిన నిర్మాతలకు షాక్ తగిలింది. మదగజరాజ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఓపెనింగ్ కలెక్షన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. హీరో విశాల్ రాకపోయినా, తెలుగులో వరలక్ష్మి శరత్‌కుమార్, అంజలి ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. అయినా ఆశించిన ఫలితం దక్కలేదు. మూవీ కంటెంట్ చాలా రొటీన్‌గా ఉందనే టాక్ ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది.
మదగజరాజ తమిళంలో ఘనవిజయం సాధించడానికి కారణాలున్నాయి. పొంగల్ సమయంలో కోలీవుడ్ మార్కెట్‌లో పెద్దగా సినిమాలు రిలీజ్ కాలేదు. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ లభించింది. వరుసగా సెలవులు రావడం, విజయ్ ఆంటోని అందించిన పాటలు క్లిక్ అవ్వడంతో సినిమా హిట్ టాక్ అందుకుంది. అయితే తెలుగులో ఈ ఫార్ములా పని చేయలేదు. సంతానం కామెడీ, పంచ్‌లు పేలినా, రొటీన్ కాన్సెప్ట్‌పై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు.
తమిళ్‌లో సంక్రాంతికి వచ్చి విజయం సాధించిన సినిమాల జాబితాలో మదగజరాజా చేరిపోయింది. మణివణ్ణన్, మనోబాల వంటి దివంగత కళాకారులు ఈ సినిమాలో కనిపించడం కూడా తమిళ ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ అంశాలనే చూసిన తెలుగు ప్రేక్షకులకు సినిమా పాతదిగా అనిపించింది. సినిమాలో కమర్షియల్ మసాలా ఎలిమెంట్‌లకు కొదవలేకపోయినా ఎక్కువ మందిని థియేటర్‌కి రప్పించలేకపోయింది. అందుకే సినిమాలకు విడుదల సమయం చాలా కీలకం.
కాగా, ఈ సినిమాలో విశాల్ హీరోగా నటించగా, అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. సుందర్.సి దర్శకత్వం వహించగా, జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ సంస్థ నిర్మించింది.
12ఏళ్ల తర్వాత విశాల్ మూవీకి మోక్షం- సంక్రాంతికి రిలీజ్
విశాల్‌కు ఏమైంది? అభిమాన హీరోను అలా చూసి ఆందోళనలో ఫ్యాన్స్!