No Time Slot Tokens For Devotees at Tirumala : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇవ్వకుండా, నేరుగా క్యూలైన్లలోకి టీటీడీ అనుమతిస్తోంది. ఈనెల 10 నుంచి 19 వరకు టికెట్లు, టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే వైకుంఠద్వార దర్శనం కల్పించారు. ఆ తేదీల్లో దూర ప్రాంతాలు నుంచి వచ్చిన సామాన్యులకు స్వామివారి దర్శనం లభించలేదు. దీంతో వారు ప్రస్తుతం పెద్దఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. రద్దీ తగ్గేవరకు సర్వదర్శనం భక్తులకు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోకి తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతిస్తున్నారు. ఈ దర్శనాలు ముగిసిన అనంతరం ఈనెల 23న గురువారం తెల్లవారుజాము నుంచి ఏరోజుకారోజు సర్వదర్శనం టోకెన్ల పంపిణీని పునఃప్రారంభించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
టోకెన్లు లేని సర్వదర్శనంపై చర్చ ? : శ్రీవారి సర్వదర్శనానికి వచ్చే భక్తులను గతంలోలా టోకెన్లు లేకుండా అనుమతించడంపై టీటీడీ ఉన్నతాధికారులు చర్చించినట్లు సమాచారం. మంగళవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తిరుపతిలో టోకెన్లు ఇవ్వకుండా, తిరుమలలో నేరుగా స్వామివారి దర్శనానికి అనుమతించడంపై పరిశీలించాల్సిందిగా సీఎం సూచించారు. దీనిపై నేరుగా సర్వదర్శనానికి అనుమతిస్తే ఎదురయ్యే ఇబ్బందులు, ప్రయోజనాలపై ఉన్నతాధికారులు చర్చించినట్లు తెలిసింది. అలాగే ఇటీవల తిరుపతిలో వైకుంఠద్వార దర్శన టోకెన్లు జారీ చేసే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందడంపై కూడా చర్చించారు. అయితే సీఎం చేసిన సూచనపై మాత్రం టీటీడీ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్ - మంగళవారం బ్రేక్ దర్శనాలు రద్దు!