Israel Top General Resigns : ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవీ రాజీనామా చేశారు. మార్చి 6న తాను బాధ్యతల నుంచి వైదొలగనున్నట్టు తెలిపారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడిని ఆపడంలో విఫలమైనందుకు బాధ్యత వహిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాల్పుల విరమణ వేళ
ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం బందీలు విడుదలవుతున్నారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌లో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ సైన్యాధిపతి హెర్జీ హలేవీ హఠాత్తుగా రాజీనామా ప్రకటించారని స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది.
46,000 మంది మృతి!
2023 అక్టోబర్‌లో హమాస్ చేసిన దాడిలో దాదాపు 1200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 250 మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నారు. దీంతో హమాస్‌పై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడింది. గాజాపై తీవ్రస్థాయిలో విరుచుపడింది. హమాస్‌కు చెందిన కీలక నాయకులను మట్టుపెట్టింది. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 46,000 మందికిపైగానే పాలస్తానీయులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీనితో ఇప్పటికే ముగ్గురు బందీలను హమాస్ విడుదల చేసింది. ఈ తరుణంలో ఇజ్రాయెల్ సైన్యాధిపతి రాజీనామా ప్రకటించడం గమనార్హం.