Unilever Company Ready To Invest In Telangana : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో 'ఇండస్ట్రీస్ ఇన్ ఇంటెలిజెంట్ ఏజ్ థీమ్'తో జరుగుతున్న 55వ ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో 'తెలంగాణ రైజింగ్' నినాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం వరస భేటీలు, చర్చలు జరుపుతోంది. దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులోని గ్రాండ్ ఇండియన్ పెవిలియన్‌లో ప్రత్యేకంగా తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాశ్వాన్, కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి, కేరళ పరిశ్రమల శాఖ మంత్రి పి.రాజీవ్ తదితరులతో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు.
పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటు : రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులపై చర్చించిన కేంద్ర మంత్రులు స్కిల్ డెవలప్ మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ పథకాలకు పూర్తి మద్దతునిస్తామని హామీ ఇచ్చారు. ప్రముఖ బహుళ జాతి సంస్థ యూనిలివర్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఆ కంపెనీ సీఈవో హీన్ షూమేకర్, చీఫ్ సప్లై చెయిన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్తో రాష్ట్ర బృందం సమావేశమైంది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు యూనిలివర్ సంస్థ అంగీకరించింది. రాష్ట్రంలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
మరోవైపు రాష్ట్రంలో 500కోట్లతో రాకెట్ తయారీ, టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు స్కైరూట్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. స్కైరూట్ ఏరోస్పేస్ యాజమాన్యం, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే హైదరాబాద్‌ను ప్రైవేట్ రంగ అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని స్కై రూట్ కో ఫౌండర్ పవన్ కుమార్ చందన తెలిపారు.
పెట్టుబడులపై చర్చ : తెలంగాణ పెవిలియన్‌లో ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీ ఎజిలిటీ ఛైర్మన్ తారెక్ సుల్తాన్‌తో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల ఆదాయం పెంచేందుకు ఇస్తున్న ప్రాధాన్యతలపై చర్చించారు. కాలిఫోర్నియాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ సాంబనోవా కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సూ లేతో మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు.
ప్రపంచ దేశాలు రాష్ట్రం వైపు తలెత్తి చూసే సమయం ఆసన్నమైంది - సింగపూర్ మీట్ అండ్ గ్రీట్‌లో సీఎం రేవంత్
హైదరాబాద్‌కు పెట్టుబడుల పంట - రూ.450 కోట్లతో విశ్వనగరంలో ఐటీ పార్క్ నిర్మాణం