Rohit Sharma Champions Trophy : దాయాది దేశం పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. 1996 తర్వాత పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోన్న తొలి ఐసీసీ టోర్నమెంట్ కావడం వల్ల ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్లాన్ చేస్తోంది. ఫిబ్రవరి 16 లేదా 17న ఓపెనింగ్ సెర్మనీ ఉండే అవకాశం ఉంది. వార్మప్ మ్యాచ్‌లను బట్టి తేదీల్లో మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది.
పీసీబీ అసహనం
అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ వేడుకల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొనడం లేదన్న వార్తలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అసహనం వ్యక్తం చేసింది. మెగా టోర్నీకి ముందు కెప్టెన్ల ఫొటోషూట్, ప్రీ-ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ వంటి కార్యక్రమాల్లో రోహిత్ హాజరవుతారని భావించినప్పటికీ, బీసీసీఐ ఆయన పాకిస్థాన్ ప్రయాణంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంపై పీసీబీ స్పందించింది.
"బీసీసీఐ క్రికెట్‌లోకి రాజకీయాలను తీసుకువస్తోంది. ఇది ఆటకు ఏమాత్రం మంచిది కాదు. భారత జట్టును పాకిస్థాన్ పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ప్రారంభోత్సవానికి టీమ్ ఇండియా కెప్టెన్‌ను పంపేందుకు ఇష్టపడడం లేదు. ఇప్పుడు ఆతిథ్య దేశం పేరును వారి జెర్సీపై ముద్రించకూడదని అనుకుంటోందని తెలుస్తోంది" అని పీసీబీ అధికారి ఒకరు బీసీసీఐపై అసహనం వ్యక్తం చేశారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. అయితే, భారత్ ఆడే మ్యాచులన్నీ హైబ్రిడ్ మోడల్లో దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఒకవేళ భారత్ సెమీస్, ఫైనల్‌కు చేరినా ఆ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే జరుగుతాయి.
ఫిబ్రవరి 20న తొలి మ్యాచ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 20న దుబాయ్‌లో టీమ్ ఇండియా తన తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌పై ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి ఏర్పడింది. మార్చి 2న కివీస్‌తో గ్రూప్ దశ చివరి మ్యాచ్ ఆడనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, గిల్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, పాండ్య, అక్షర్ పటేల్, పంత్, జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, షమీ, అర్ష్‌దీప్ సింగ్
గతంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ల్లో - టీమ్ ఇండియా చాలా మంచి ప్రదర్శనలు చేసింది. 2013లో ధోనీ నాయకత్వంలో భారత్ చివరిసారిగా ఈ ట్రోఫీని ముద్దాడింది. అయితే, 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫైనల్ చేరి పాక్ చేతిలో ఓటమిపాలైంది. 2025లో జరిగే ఈ ప్రతిష్ఠాత్మక లీగ్‌లో భారత్ మరోసారి ట్రోఫీని తమ సొంతం చేసుకునే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.