CM Revanth On Rajiv Gandhi Civils Abhayahastam : సివిల్స్ మెయిన్స్ ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించారు. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థులకు చెక్కులను అందజేశారు. ప్రజా భవన్‌లో నిర్వహించిన 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం' కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ నుంచి అభ్యర్థులకు సహాయం చేస్తున్నట్లు తెలిపారు. వెనుకబడిన రాష్ట్రం అయిన బిహార్ నుంచి ఎక్కువ ఐఏఎస్‌లు వస్తున్నారని అన్నారు. ఆ రాష్ట్రంలో సివిల్స్‌లో ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లే ఎక్కువ మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ అధికారులు కేంద్రంలో ఉన్నా, రాష్ట్రం కోసం కృషి చేయాలని, తమ ప్రభుత్వం వచ్చాక సంవత్సరంలో 55,143 ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. ఇది దేశంలోనే ఒక రికార్డని తెలిపారు.
మార్చి 31 లోపు నియామకాలు పూర్తి : గత పది సంవత్సరాల్లో పేరుకుపోయిన ఖాళీలను భర్తీ చేస్తూ ప్రస్తుతం ఉద్యోగాలు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడిందని కొనియాడారు. గతంలో ఎన్నడూ 563 గ్రూప్-1 ఉద్యోగాలు ఇవ్వలేదని, 14 సంవత్సరాలుగా వీటి నియామకాలు చేపట్టలేదని అన్నారు. ఇన్ని ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేక అడ్డుకునే కుట్ర చేశారని ఆరోపించారు. గ్రూప్-1పై కుట్రలు అన్నీ ఛేదించి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఈ విషయంలో కోర్టులు రాష్ర ప్రభుత్వానికి అండగా నిలిచాయని, మార్చి 31 లోపు ఈ నియామకాలు పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం ఆలోచించేది యువత భవిష్యత్ కోసమేనని, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
'గత పది సంవత్సరాల్లో పేరుకుపోయిన ఖాళీలను భర్తీ చేస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చాక సంవత్సరంలో 55,143 ఉద్యోగాలు ఇచ్చాం. ఇది దేశంలోనే ఒక రికార్డు. మార్చి 31 లోపు గ్రూప్ 1 నియామకాలు పూర్తి చేస్తాం.'- రేవంత్ రెడ్డి, సీఎం
సింగరేణి కాలనీల నిర్మాణం : ఇప్పటికే ప్రిలిమ్స్ పూర్తి చేసిన 40 మంది అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందించామని, ఈరోజు ఇంటర్వ్యూలకు ఎంపికైన 20 మందికి చెక్కులు పంపిణీ చేయటం సంతోషంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.కోటి 25 లక్షలు వారి కుటుంబాలకు అందించేలా ఈరోజు ఎంవోయూ చేస్తామని తెలిపారు. అలాగే సింగరేణి కాలనీల నిర్మాణాన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఈ సంస్థ నుంచే సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక సాయాన్ని అందించామని తెలిపారు.
'చిన్న ఆరోపణ లేకుండా టీజీపీఎస్సీ పనిచేస్తోంది - త్వరలోనే గ్రూప్1 నియామక పత్రాలు'