Matchbox Saree Gift For Tirumala Srivaru : తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ అగ్గిపెట్టెలో పట్టే చీరను మగ్గంపై నేసి తిరుమల శ్రీవారికి శనివారం ఉదయం సమర్పించారు. అంతకు ముందు ఆలయం వెలుపల మీడియాలో ఆయన మాట్లాడారు. ఏటా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి, తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు నేసి అందిస్తున్నామని తెలిపారు. ఉంగరంలో దూరే చీర, దబ్బనంలో దూరే చీరను కూడా తయారు చేశామన్నారు.
అగ్గిపెట్టెలో పట్టే చీర : వెండి కొంగు చీర, ఇటీవలే 200 గ్రాముల బంగారంతో చీరను తయారు చేశామని తెలిపారు. ప్రస్తుతం శ్రీవారికి సమర్పిస్తున్న అగ్గి పెట్టెలో పట్టే చీర దాదాపు ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు ఉంటుందన్నారు. తయారీకి 15 రోజుల సమయం పట్టిందని వివరించారు.
విజయ్ తరచుగా అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలకు కానుకగా సమర్పిస్తూ ఉంటారు. ఇటీవలే వేములవాడ రాజేశ్వరి దేవికి కానుకగా సమర్పించారు. తాజాగా తిరుమల శ్రీవారికి పూజలు చేసి ఆలయ అధికారులకు చీరను అందజేశారు. స్వామి వారికి బహూకరించి కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.
వారసత్వంగా అగ్గిపెట్టెలో పట్టే చీర : సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్ వారసత్వంగా నేత పనిని కొనసాగిస్తున్నాడు. తన తండ్రి గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీరలను నేసి తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు, ప్రజా ప్రతినిధులకు బహూకరించే వారు. ఆ వారసత్వాన్ని తాను కొనసాగించాలనే ఉద్దేశంతో తాను కూడా ఈ చీరలను ఆలయాలకు బహూకరిస్తున్నట్లు తెలిపారు.
200 గ్రాముల బంగారంతో చీర : గతంలోనూ 200 గ్రాముల పసిడితో బంగారు చీర తయారు చేసి నేత కార్మికుడు నల్ల విజయ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన కుమార్తె పెళ్లికి 200 గ్రాముల బంగారంతో చీర తయారు చేయాలని కోరారు. దీంతో ఆ చీరను తయారు చేసి ఇచ్చారు. ఆ చీర 49 ఇంచుల వెడల్పు, ఐదున్నర మీటర్ల పొడవు, బరువు 800 నుంచి 900 గ్రాములు ఉంది. ఆ చీరను రూ.20 లక్షల ఖర్చుతో తయారు చేసినట్లు విజయ్‌కుమార్ తెలిపారు.
భద్రాద్రి సీతమ్మకు కానుకగా త్రీడీ చీర - చూస్తే వావ్ అనాల్సిందే! - Making Video of 3D Saree