Indiramma Housing Scheme Update : ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అధికారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను తయారు చేశారు. ఈ మేరకు ఇళ్ల గ్రౌండింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తూ, మొదట ఆయా గ్రామాల్లో ప్రీ-గ్రౌండింగ్ సమావేశాల ఏర్పాటుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులు ఇంటిని ఎలా నిర్మించుకోవాలి, ఇతర అనుమానాలు, నిర్మాణ సామగ్రి సరఫరా వంటి అంశాలను ఇందులో నివృత్తి చేయనున్నారు.
ఈ అంశాలనే వివరించనున్నారు :
- ఇందిరమ్మ యాప్ సర్వే సమయంలో సొంత స్థలం చూపిన ప్రాంతంలో లబ్ధిదారుడే ముగ్గు పోసుకోవాల్సి ఉంటుంది. లబ్ధిదారుడు మరోచోట ఇల్లు కట్టుకుంటానంటే ఆ ఇంటిని అధికారులు రద్దు చేసేస్తారు.
- ముగ్గు పోసిన తర్వాత గ్రామ కార్యదర్శికి సమాచారం అందిస్తే, క్షేత్రస్థాయికి వచ్చి ఫొటోలు తీసుకొని ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేస్తారు. నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేసి ఇస్తారు.
- కనీసం 400 చదరపు అడుగులు కంటే తక్కువ కాకుండా ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది.
- అయితే ముగ్గు పోసే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందదు. పునాది పూర్తయిన తర్వాతే మొదటి విడతలో రూ.లక్షను లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తుంది ప్రభుత్వం.
- ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుకను అందించాలని నిర్ణయించగా, దీనికి సంబంధించి కూపన్లను తహసీల్దార్ లేదా ఆర్డీవో ద్వారా అందిస్తారు.
- క్షేత్రస్థాయిలో ఏఈ లేదా ఎంపీడీవోలు పర్యటించి ఇంటి నిర్మాణం పూర్తయిన దశను చూసి లబ్ధిదారుడికి జమ చేసే నగదు కోసం సిఫార్సు చేయనున్నారు.
- సిమెంటు, స్టీలు వంటి సామగ్రిని హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తక్కువ ధరకు అందించేలా ఏర్పాట్లు చేయనున్నారు.
- ఇప్పటికే అక్కడక్కడ ప్రీ-గ్రౌండింగ్ పనులు పూర్తి కాగా, మిగిలిన గ్రామాల్లో ఈ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
21 నియోజకవర్గాల్లో 1000కి పైగా ఇళ్లు : రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో 71,482 ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించగా, ఇందులో 21 నియోజకవర్గాల్లో 1000కి పైగా ఇళ్లను ఇవ్వనుంది. ఇందులో అత్యధికంగా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 2,528 ఇళ్లు ఇవ్వనున్నారు. ఆ తర్వాత మంథని 1,952, బోథ్ 1,538, పరకాల 1,501, హుస్నాబాద్, సిర్పూర్, దుబ్బాక, పరిగి, బెల్లంపల్లి, జహీరాబాద్, పెద్దపల్లి, కోదాడ, చొప్పదండి, పినపాక, దేవరకొండ, ములుగు, ఆసిఫాబాద్, కొడంగల్, అందోలు, తుంగతుర్తి, గజ్వేల్‌లో ఇళ్లను అందించనున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో 1000కి లోపే ఇళ్లను ఎంపిక చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల అప్డేట్ - 3 జాబితాలుగా దరఖాస్తులు
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా ఎలా? - అధికారులతో చర్చించిన సీఎం రేవంత్