Drug Kit Results Are Coming Out Differently : హైదరాబాద్ పోలీసులు ఓ వేడుకలో తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్న అనంతరం డ్రగ్స్ కిట్‌తో మూత్ర పరీక్ష నిర్వహించారు. ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. వారిలో ఓ యువకుడు తనకు మత్తు పదార్థాలు అలవాటు లేదని, జ్వరానికి మాత్రలు వేసుకున్నానని చెప్పినా పోలీసులు వినలేదు. ఆసుపత్రిలో రక్త నమూనా సేకరించి పరీక్షలు చేస్తే నెగిటివ్ వచ్చింది.
డ్రగ్స్ మహమ్మారిని కట్టడి చేసేందుకు గతంలో పోలీసులు, ఆబ్కారీ యంత్రాంగం విక్రేతలపై మాత్రమే కేసులు నమోదు చేసేవారు. రెండు సంవత్సరాలు నుంచి కొనుగోలుదారులపై కూడా కేసులు పెడుతున్నారు. గతంలో తనిఖీల్లో చిక్కిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షించేవారు. ఒక్కో పరీక్షకు రూ.4-5వేలు ఖర్చు అయ్యేది. ఇవే పరీక్షలను తేలికగా చేసేందుకు డ్రగ్ టెస్టింగ్ కిట్లను అందుబాటులోకి తెచ్చారు. ఆబ్కారీ, టీజీ న్యాబ్, హెచ్‌న్యూ, పోలీసులు అధికంగా వీటినే ఉపయోగిస్తున్నారు. వారు నిర్వహించిన పరీక్షల్లో భిన్న ఫలితాలు రావడం అధికారులకు తలనొప్పిగా మారింది. పోలీసుల తీరుతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు.
హైదరాబాద్ నగరంలో ఆబ్కారీ పోలీసులు ఓ పబ్‌లో సోదాలు చేపట్టారు. అక్కడ కిట్లతో చేసిన పరీక్షల్లో ఐదు మంది డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారించారు. ఆసుపత్రిలో వారికి నిర్వహించిన రక్త పరీక్షలో ఎలాంటి మాదక ద్రవ్యాలు తీసుకోలేదు అంటూ వైద్యులు నివేదిక ఇచ్చారు.
ఎందుకిలా జరుగుతుంది? : అనుమానితుల మూత్రం, లాలాజలం నమూనాలు సేకరించి కిట్లతో సెకన్లలో నిర్ధారణ చేస్తున్నారు. వీటిలో 70 నుంచి 80 శాతం మాత్రమే కచ్చితత్వం ఉంటున్నట్టు నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల మాత్రలు తీసుకునే వారిలో మూత్ర పరీక్ష నిర్వహిస్తే పాజిటివ్ వస్తుందని ఓ పోలీసు అధికారి అన్నారు. డ్రగ్స్ తీసుకున్న వారిలో ఎక్కువ మంది నాలుక తడి ఆరిపోతుంది. వారి నుంచి లాలాజలం సేకరించడం కష్టంగా మారుతోంది. దీంతో మూత్ర నమూనాలను సేకరిస్తున్నారు. కొన్ని సార్లు ఫలితం వేరుగా వస్తుండటంతో కిట్లతో ప్రాథమిక పరీక్ష నిర్వహించిన తరువాత పూర్తి నిర్ధారణకు ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు.
జీవితాన్ని నాశనం చేసే డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ : ప్రభాస్
స్వలింగ సంపర్కులే లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా - ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు