Lokesh Meeting with Amit Shah: అమిత్‌షాతో నారా లోకేశ్ భేటీ.. 'ఏపీలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నాం'..'సీఎం జగన్ కక్ష సాధిస్తున్నాడు..'
🎬 Watch Now: Feature Video
Lokesh Meeting with Amit Shah: ఏపీ ముఖ్యమంత్రి జగన్.. తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి దిల్లీలో అమిత్‌షాను కలిసిన లోకేశ్.. ఒకవైపు చంద్రబాబును అరెస్టు చేయడంతో పాటు, మరోవైపు విచారణల పేరుతో తమను వేధిస్తున్నారని ఆయనకు చెప్పారు. తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు, మీపై ఎన్ని కేసులు పెట్టారని అమిత్‌షా లోకేశ్‌ను అడిగారు. జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు, ప్రస్తుతం ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న వివిధ కేసుల విచారణ స్థితి గురించి లోకేశ్ వివరించారు. 73 ఏళ్ల వయసున్న వ్యక్తిని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అమిత్‌షా అభిప్రాయపడినట్లు తెలిసింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఏపీలో జరుగుతున్న అన్ని పరిణామాలనూ గమనిస్తున్నామని అమిత్‌షా లోకేశ్‌తో అన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి, కిషన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని.. కక్షపూరితంగా చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టిందని, జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్లు సమావేశం అనంతరం లోకేశ్ ట్వీట్ చేశారు. అటు చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రం ఉందని ఆరోపణలు చేస్తున్నవారు ఇప్పుడు లోకేశ్‌కు అమిత్‌షా ఎలా అపాయింట్‌మెంట్ ఇచ్చారో సమాధానం చెప్పాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన పురందేశ్వరి.. ఏపీ ప్రభుత్వం, ఉన్నత స్థానాల్లో ఉన్న నాయకులు చేస్తున్న కక్షసాధింపు రాజకీయాల గురించి లోకేశ్ అమిత్‌షాకు పూర్తిగా వివరించారని పేర్కొన్నారు.