LRS Applications Finalized Automatically : ఎల్‌ఆర్‌ఎస్ (ప్లాట్ల క్రమబద్ధీకరణ), అనధికార లే అవుట్లపై పురపాలక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. చెరువుల ఎఫ్‌టీఎల్‌కు 200 మీటర్ల పరిధిలోని, ప్రభుత్వ భూములకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్లు మినహా మిగతా సర్వే నంబర్లలోని ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు ఆటోమేటెడ్‌గా ఫీజు ఖరారు చేయనున్నారు. మార్చి 31లోగా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుతో పాటు ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లిస్తేనే 25 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అలా కాకుండా భవన నిర్మాణ సమయంలో అనుమతికి కోసం వస్తే మాత్రం ఆ రాయితీ వర్తించదు.
మార్గదర్శకాలు :
- నీటి వనరులు, చెరువుల వద్ద ఎఫ్‌టీఎల్ పరిధి నుంచి 200 మీటర్ల పరిధిలోని భూములను సర్వే నంబర్ల వారీగా గుర్తించి వాటిని సాఫ్ట్‌వేర్‌లో పొందుపరచాలి. ఈ సంబంధిత వివరాలను అధికారులు సెంటర్‌ఫర్ గుడ్ గవర్నెన్స్(CGG)కి పంపించాలి. ఈ సర్వే నంబర్లలోని దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలన కోసం నీటిపారుదల, రెవెన్యూశాఖలకు పంపించాలి. దీన్ని పట్టణప్రణాళిక విభాగం సమన్వయం చేస్తుంది.
- ఎఫ్‌టీఎల్ నుంచి 200 మీటర్ల పరిధిలోని, ప్రభుత్వ భూములకు ఆనుకుని ఉన్న స్వే నంబర్ల మినహా మిగతా భూముల దరఖాస్తులను మున్సిపల్ లేదా పంచాయతీ అధికారులు పరిశీలించాలి. ఇలా పరిశీలించిన దరఖాస్తులను నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు సిఫార్సు చేసి దరఖాస్తులపై ఆయా శాఖల అధికారుల సిఫార్సుల ఆధారంగా తదుపరి ప్రక్రియను అధికారులు చేపట్టాలి.
- ప్రభుత్వ భూములకు అనుకుని ఉన్న సర్వే నంబర్ల జాబితాను సిద్ధం చేసి సీజీజీకి పంపించి, ఆ సర్వే నంబర్లలోని ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలనకు రెవెన్యూ శాఖకు పంపించాలి.
- ఇటీవల పురపాలక శాఖ జారీ చేసిన జీవో 28 ప్రకారం మార్చి 31 లోగా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లిస్తే 25 శాతం రాయితీ వస్తోంది. ఫీజు చెల్లించిన వెంటనే అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి దరఖాస్తులను ప్రాసెస్ చేస్తారు. ప్లాటు జీవో నిబంధనలకు లోబడి ఉంటేనే క్రమబద్ధీకరణ అనేది ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. లేదంటే తిరస్కరిస్తారు. ఫీజులో పదిశాతం ప్రాసెసింగ్ కింద మినహాయించి, మిగతాది చెల్లిస్తారు.
ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి : ఎల్‌ఆర్‌ఎస్ కటాఫ్ తేదీకి ముందుగా వేసిన లేఅవుట్లలోని ప్లాట్లను ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌కు అనుమతిని ఇచ్చింది. ఈ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎల్‌ఆర్‌ఎస్ ఆన్‌లైన్ లింకు ద్వారా దరఖాస్తుదారు పూర్తి సమాచారం అందించాలి. ఈ ప్లాట్లు అనధికార లేఅవుట్‌లో 26.08.2020 నాటికి ఉంటూ అంతకుముందు అందులో కనీసం పది శాతం ప్లాట్లు సేల్‌డీడ్ ద్వారా విక్రయం జరిగి ఉండాలి.
- దరఖాస్తుదారు సబ్‌రిజిస్ట్రార్‌కు ఇందుకు సంబంధించి ప్రమాణ పత్రాన్ని సమర్పించడంతో పాటు కటాఫ్ తేదీ నాటికి ముందు విక్రయించిన ప్లాట్ల వివరాలు, దస్తావేజు పత్రాలను సైతం వెల్లడించాలి.
- ఎల్‌ఆర్‌ఎస్-2020లో దరఖాస్తు చేసి ఉంటే అవసరమైన సమాచారాన్ని ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్ నుంచి రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌కు బదిలీచేయాలి.
- రిజిస్ట్రేషన్ సమయంలో కొనుగోలుదారు వివరాలతో పాటు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు వివరాలు నమోదు చేశాక తాత్కాలిక రుసుము జనరేట్ అవుతుంది.
- ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనలకు లోబడి క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్‌స్పేస్ ఛార్జీలు చెల్లించాలి.
- ఈ చెల్లింపులు పూర్తయిన తరువాతే ప్లాటు రిజిస్ట్రేషన్ చేస్తారు.
- అనంతరం ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు, వసూలు చేసిన ఫీజుల వివరాలను సబ్‌రిజిస్ట్రారు ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్‌కు పంపించాలి.
- సబ్ రిజిస్ట్రార్ నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించి, ఆమోదిస్తే ప్లాటు కొనుగోలుదారుడి పేరిట ప్రొసీడింగ్స్ జారీ అవుతాయి.
- దరఖాస్తుదారులు ప్రస్తుతం ఓపెన్‌స్పేస్ ఛార్జీలు చెల్లించకున్నా భవన నిర్మాణ అనుమతి సమయంలో ఆ మొత్తం చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. అయితే 25 శాతం రాయితీ వారికి వర్తించదు.
ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ పొందడం ఎలా? - రిజిస్ట్రేషన్ కోసం ఫీజు ఎక్కడ చెల్లించాలి?
హెచ్ఎండీఏ ఆశలన్నీ ఆ లక్ష ప్లాట్లపైనే - ఎల్ఆర్ఎస్తో రూ.1000 కోట్ల ఆదాయం?