Two People Died After Pouring Kerosene On Their Bodies : శరీరంపై కిరోసిన్ పోసుకొని ఓ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా తిమ్మారెడ్డిపల్లి వద్ద చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఓ వ్యక్తి, మహిళ శనివారం రాత్రి జిల్లాలోని తిమ్మారెడ్డిపల్లి వద్ద దిగారు. రాజీవ్ రహదారి పక్కన చెట్ల పొదల వైపు వెళ్లారు. అనంతరం తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనను గుర్తించిన స్థానిక ప్రయాణికులు మంటలు ఆర్పారు. అప్పటికే మహిళ మృతి చెందగా, పురుషుడు కొన ఊపిరితో ఉన్నాడు.
అన్ని కోణాల్లో దర్యాప్తు : విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఘటనా స్థలి వద్ద దొరికిన ఆధారాల మేరకు సిద్దిపేట సాయి విద్యానగర్‌కు చెందిన శిరోద్కర్ లక్ష్మి, రంగారెడ్డి జిల్లా మేడిపల్లి ఘట్కేసర్కు చెందిన టెక్లేకర్ శ్రీధర్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వీరు ఇరువురు సిద్దిపేట, చేర్యాల ప్రాంతాల్లో అద్దెకు ఉన్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం - అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి