Important Update On Rythu Bharosa : రైతుభరోసా ఇంకా రాలేదని పలువురు రైతన్నలు వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఉండి, భరోసా సాయం అందని రైతులు నిర్దేశిత కార్యాలయాల్లో కారణం తెలుసుకుని దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించింది.
సహాయ కేంద్రాల ఏర్పాటు : 3 ఎకరాల్లోపు ఉన్న రైతులకు భరోసా సాయం పంపిణీ చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించిన విషయం విధితమే. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఆర్‌ఎస్‌ఆర్ (రీసర్వే రిజిస్టర్) తేడా కారణంగా నిజామాబాద్ జిల్లాలో 25,000 మందికి పైగా నగదు జమ కాలేదు. 1154 మంది రైతులకు సాంకేతిక సమస్యలతో డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ఫెయిల్ కారణంగా నగదు జమ కాలేదు. రైతు భరోసా సాయం రైతులకు ఎందుకు అందలేదనే విషయంపై వ్యవసాయ శాఖ వద్ద ఇప్పటి వరకు నిర్దిష్ట సమాచారం లేదు.
డీఏవో ఆఫీసుల్లో, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బిచ్కుంద ఏడీఏ కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు(హెల్ప్‌లైన్ సెంటర్లు) ఏర్పాటు చేసి రైతుల సందేహాలను నివృత్తిచేసే బాధ్యతలను జూనియర్ అసిస్టెంట్‌లకు అప్పగించారు. రైతులకు రైతుభరోసా స్టేటస్ సమాచారాన్ని తెలియజేయడం, దరఖాస్తులను స్వీకరించి జిల్లా వ్యవసాయాధికారికి నివేదించాలని నిర్దేశించారు. రైతువేదికల్లో ఏఈవోలు(వ్యవసాయ విస్తరణాధికారులు)కు భరోసా సాయంపై వినతిపత్రాలను ఇవ్వవచ్చు.
ఆర్‌ఎస్‌ఆర్‌పై కొరవడిన స్పష్టత : ఆర్‌ఎస్‌ఆర్(రీసర్వే రిజిస్టర్) కు అనుగుణంగా సర్వే నంబర్లలో భూములు లేవనే కారణంగా జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాలకు భరోసా సాయాన్ని నిలిపివేశారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని మాత్రం రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు చూపడం లేదు. గతంలో రుణమాఫీ సమయంలో రైతువేదికలతో పాటు మండల, జిల్లా, డివిజన్ ఆఫీసుల్లో సహాయ కేంద్రాలు(హెల్ప్‌లైన్ కేంద్రాలు) ఏర్పాటు చేసి తీసుకున్న దరఖాస్తులకు మోక్షం లభించలేదు.
దీంతో ప్రస్తుతం హెల్ప్‌డెస్క్‌ల వద్ద కేవలం స్టేటస్‌ను తెలుసుకోవడంతోనే రైతులు సరిపెడుతున్నారు. రైతు భరోసా సాయం కోసం దరఖాస్తులను సమర్పించేందుకు ఆసక్తి చూపడం లేదు. రైతు‘భరోసా సాయం అందకపోతే హెల్ప్‌డెస్క్‌ల్లో దరఖాస్తులు సమర్పిస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తామని జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్ తెలిపారు. సాంకేతిక సమస్యల వల్ల నగదు జమకాని రైతులు బ్యాంకు ఖాతాల నంబర్లతో పాటు ఐఎఫ్ఎస్సీ కోడ్ నంబర్లను సరిచేసుకోవాలని’ అని తిరుమల ప్రసాద్ తెలిపారు.
నిజామాబాద్ జిల్లా
- రైతుభరోసాకు అర్హులైన రైతన్నలు : 3,25,713
- రెవెన్యూ రికార్డుల సాగువిస్తీర్ణం : 5,25,575 ఎకరాలు
- జమ చేయాల్సిన నగదు : 315.36 కోట్ల రూపాయలు
- జమ చేసింది : రూ.150.45 కోట్లు
- సాయం పొందినటువంటి రైతులు : 2,20,184