Karnataka Preamble Reading : ఒకేసారి 'రాజ్యాంగ పీఠిక' చదివిన లక్షలాది మంది.. స్కూళ్లలో కూడా ఇక తప్పనిసరి! - అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం
🎬 Watch Now: Feature Video
By PTI
Published : Sep 15, 2023, 6:02 PM IST
|Updated : Sep 15, 2023, 6:09 PM IST
Karnataka Preamble Reading : కర్ణాటకలో ఒకేసారి లక్షలాది మంది రాజ్యాంగ పీఠికను చదివారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం మెగా కార్యక్రమాన్ని నిర్వహించింది. బెంగళూరులోని విధాన సౌధ వద్ద నిర్వహించిన ఈ ఈవెంట్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఒకే సమయంలో రాజ్యాంగ పీఠికను పఠించారు.
ఇంతకుముందు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ప్రతీ రోజు.. భారత రాజ్యాంగ పీఠికను విద్యార్థులతో ఉపాధ్యాయులు చదివించడం తప్పనిసరి చేసింది. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో సహా మంత్రులు అసెంబ్లీలో రాజ్యాంగ పీఠిక చదివే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక విధులను అందరూ నిర్వర్తించాలని.. అందుకు విద్యార్థులకు రాజ్యాంగ బాధ్యతలు తెలియజేసే ఏర్పాట్లు చేస్తున్నామని కర్ణాటక సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మహదేవప్ప తెలిపారు. రాజ్యాంగ విలువలు, సూత్రాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఇక నుంచి అందరు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉదయం ప్రార్థనల సమయంలో రాజ్యాంగ పీఠికను చదవాల్సి ఉంటుంది. రాజ్యాంగ సూత్రాలను తమ దైనందిన జీవితంలో స్వీకరిస్తామని ప్రమాణం చేయాల్సి ఉంటుంది. భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రాజ్యాంగ పీఠిక పేర్కొంది. పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని పెంపొందించడం వంటివి రాజ్యాంగ ప్రవేశిక కల్పించిన లక్ష్యాలుగా ఉన్నాయి.