ముఖానికి బూడిద, మెడలో చెప్పుల దండ- గాడిదపై కొత్త అల్లుడు ఊరేగింపు- హోలీ స్పెషల్ గురూ! - Son In Laws Donkey Ride On Holi
🎬 Watch Now: Feature Video
Published : Mar 26, 2024, 12:55 PM IST
Son In Laws Donkey Ride On Holi : రంగుల పండుగ హోలీని పల్లె నుంచి పట్నం దాకా ప్రతి చోటా ఉత్సాహంగా జరుపుకొంటారు. ఈ వేడుకలు జరుపుకొనే క్రమంలో దేశంలోని పలు ప్రాంతాల్లో విభిన్నమైన ఆచారాలను పాటిస్తుంటారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్ల విదా గ్రామస్తులు ధూళి వందన్ అనే విచిత్రమైన ఆచారాన్ని దాదాపు గత 86 ఏళ్లుగా అనుసరిస్తున్నారు. ఈ ఆచారంలో కేంద్ర బిందువు కొత్త అల్లుళ్లే. ఊరికి చెందిన కొత్త అల్లుళ్లు అందరినీ హోలీ రోజున గాడిదలపై కూర్చోబెట్టి ఊరంతా ఊరేగిస్తారు. అంతేకాదు వారి మెడలో చెప్పుల మాలను వేస్తారు. వారి మొహాన్ని రంగులతో, హోలికా దహనం తర్వాత సేకరించిన బూడిదతో నింపేస్తారు. ఈ ఊరేగింపులో కొత్త అల్లుళ్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులంతా కులమతాలకు అతీతంగా కలిసి కేరింతలు చేస్తూ హోలీ ఆడతారు.
విదా గ్రామం శివారులోని హనుమాన్ ఆలయానికి చేరుకున్నాక గాడిదపై నుంచి కొత్త అల్లుళ్లను దింపి నుదుటిపై తిలకం దిద్ది కొత్త బట్టలు, బంగారు ఉంగరంతోపాటు ఇతర కానుకలను అందిస్తారు. విదా చాలా చిన్న ఊరు కావడం వల్ల ప్రతి సంవత్సరం కొత్త అల్లుళ్లు సగటున నలుగురు లేదా ఐదుగురు మాత్రమే హోలీ వేడుకల్లో పాల్గొంటుంటారు. అన్నట్టు ఈ సంవత్సరం హోలీ రోజున (సోమవారం) సంతోష్ జాదవ్ అనే ఒకే ఒక్క కొత్త అల్లుడిని గాడిదపై ఊరేగించారు. 86 ఏళ్ల క్రితం ఈ గ్రామానికి పెద్దగా ఉన్న ఠాకూర్ ఆనందరావు దేశ్‌ముఖ్ కొత్త అల్లుడు హోలీ రోజున వచ్చినప్పుడు ఈ ఆచారం మొదలైందని స్థానికులు చెబుతున్నారు.