India Successfully Launches Agni4 Ballistic Missile:డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) రూపొందించిన అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ పరీక్షను భారత్ శుక్రవారం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ బాలిస్టిక్ క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ పరీక్ష సక్సెస్ కావడంతో ఈ మిస్సైల్‌లోని సాంకేతిక వ్యవస్థలు, నిర్వాహక వ్యవస్థలు సరిగ్గానే పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయింది. మన దేశానికి చెందిన న్యూక్లియక్ కమాండ్ అథారిటీ (ఎన్సీఏ) పరిధిలోని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (SFC) ఆధ్వర్యంలో ఈ ప్రయోగ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన అన్ని సాంకేతిక లక్ష్యాలు నెరవేరాయని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
ఈ ఇంటర్మీడియట్ రేంజ్ అగ్ని-4తో లక్ష్య పరిధి మరింత పెరిగింది. దాదాపు 4వేల కిలో మీటర్ల దూరంలోని శత్రులక్ష్యాలను ఇది చేధించగలదు. 20 మీటర్ల పొడవు ఉన్న ఈ క్షిపణికి వెయ్యి కేజీల పేలోడ్(మందుగొండు సామాను)ను మోసుకుని వెళ్లగల సామర్థ్యం ఉంది. భారీ ట్రక్కులలో దీన్ని తరలించి, ఎక్కడి నుంచైనా ప్రయోగించేందుకు అనువుగా ఈ మిస్సైల్ నిర్మాణం ఉంది. అంటే నేల మీద తిరగగలిగే లాంచర్ ద్వారా దీన్ని ప్రయోగించవచ్చు.