Toll Free Numbers for Women Safety: బాలికలు, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టి, వారికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతూనే ఉంది. అయితే వాటితో పాటు ఆపద వేళలో ఆదుకునేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లను సైతం ఏర్పాటు చేసింది. షీ టీమ్, భరోసా వంటి విభాగాల ఏర్పాటుతో మహిళలపై దాడులు, వేధింపుల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
అయితే ప్రభుత్వం చేపట్టే పలు పథకాలు, టోల్ ఫ్రీ నంబర్లపై చాలా మందికి అవగాహన ఉండటం లేదు. దీంతో అత్యవసర వేళలో ఈ సేవలు ఉపయోగించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారు అన్ని నెంబర్లు గుర్తుంచుకోకపోయినా ఈ రెండు గుర్తు పెట్టుకున్నా ఆపదలో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పూర్తి అండగా 181: మహిళలకు పూర్తి అండగా నిలుస్తున్న టోల్ ఫ్రీ నంబర్ 181. గృహహింస, వరకట్న వేధింపులు, పని ప్రదేశంలో లైంగిక వేధింపులు, ఆడపిల్లల అమ్మకం, అక్రమ రవాణాను నిరోధించేందుకు ఈ టోల్ ఫ్రీ నంబర్‌ను ఉపయోగించుకోవచ్చు. మహిళలకు రక్షణ కల్పించడంతోపాటు సలహాలు ఇవ్వడం, కౌన్సెలింగ్ నిర్వహించడం వంటి చర్యలు సైతం చేపడతారు.
బాలికల రక్షగా '1098': బాలికల రక్షణకు 1098 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు అధికారులు. బాల్య వివాహాలను నిరోధించేందుకు ఈ టోల్ ఫ్రీ నంబర్ ఉపయోగపడుతుంది. ఎక్కడైనా బాల్య వివాహాలు, బాలికలపై వేధింపులు, దాడులు జరిగితే ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు.
వేధింపుల నియంత్రణకు షీటీం: మహిళలు, బాలికలను వేధింపులు ఇతర ఇబ్బందుల నుంచి రక్షణకు షీ టీం విభాగం పని చేస్తుంది. కళాశాలలు, ఉద్యోగ ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాలు ఎక్కడైనా మహిళలపై వేధింపులు, దాడులకు పాల్పడితే షీటీంను సంప్రదించవచ్చు.
వీటితో పాటు ప్రసూతి సేవలకు అంబులెన్స్ కోసం 102, అన్ని రకాల అత్యవసర సేవల కోసం, ప్రమాదంలో ఉంటే సహాయం కోసం 112, ఆరోగ్య సలహాలు, సూచనల కోసం 104, అంగన్‌వాడీ హెల్ప్‌లైన్ కోసం 155209, గర్భిణీల కోసం హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1800 599 12345 తదితర నంబర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ సేవలు గుర్తుపెట్టుకొని అత్యవసర సమయాల్లో ఉపయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అమ్మాయిలు, మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? లేదంటే బయటికి వెళ్లినప్పుడు ఇబ్బందులే!
అమ్మాయిలూ బయటికి వెళ్తున్నారా?- మీ ఫోన్లో ఈ యాప్స్ ఉంటే ఎక్కడికెళ్లినా సేఫ్!