Coins Inside Stomach : ఓ వ్యక్తి కడుపులో నుంచి ఏకంగా 33 కరెన్సీ నాణేలను వైద్యులు బయటకు తీశారు. 3 గంటలపాటు శ్రమించి శస్త్రచికిత్స చేసి కాయిన్స్‌ను పొట్టలో నుంచి తొలగించారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్ జిల్లాలో జరిగింది.
అసలేం జరిగిందంటే?
ఘుమర్విన్కు చెందిన 33 ఏళ్ల వ్యక్తి గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతడ్ని కుటుంబ సభ్యులు జనవరి 31న బిలాస్‌పుర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలోని వైద్యులు రోగికి ఎండోస్కోపీతో సహా అనేక వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగి కడుపులో అనేక నాణేలు ఉన్నట్లు గుర్తించారు.
'247 గ్రాముల బరువైన నాణేలు తొలగించాం'
"రోగి స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నాడు. శస్త్రచికిత్స చాలా సవాల్‌గా మారింది. రోగి కడుపు బెలూన్లాగా ఉబ్బిపోయింది. కడుపులో అన్నిచోట్లా నాణేలు ఉన్నాయి. మేము ఆపరేషన్ థియేటర్లో సీఆర్ ద్వారా నాణేల కోసం వెతికాం. మొదట కడుపులో నాణేలు ఎక్కడ ఉన్నాయో గుర్తించాం. ఆ తర్వాత మూడు గంటల పాటు శ్రమించి సర్జరీ చేసి నాణేలను బయటకు తీశాం. రూ.2, రూ.10, రూ.20 డినామినేషన్లలో రూ.300 విలువైన నాణేలను తొలగించాం. వాటి బరువు 247 గ్రాములు ఉంటుంది" అని వైద్యుడు డాక్టర్ అంకుశ్ తెలిపారు.
స్కిజోఫ్రెనియా అనేది ఒక వ్యక్తి ఆలోచనలు, భావాలు, చర్యలను ప్రభావితం చేసే దీర్ఘకాలిక మానసిక వ్యాధి అని డాక్టర్ అంకుశ్ తెలిపారు. రోగులు తరచుగా భ్రమల్లో జీవిస్తారని పేర్కొన్నారు. "ఎవరైనా రోగులకు నిజం గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నించినప్పుడు కూడా వారు భ్రమలో ఉంటారు. స్కిజోఫ్రెనియా రోగి ఆలోచన, ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది" అని అంకుశ్ తెలిపారు.
కడుపులో నుంచి నాణేలు, అయస్కాంతాలు తొలగింపు
ఇటీవలే దిల్లీకి చెందిన 26 ఏళ్ల యువకుడి కడుపులో నుంచి సర్ గంగారాం ఆసుపత్రి వైద్యులు నాణేలు, అయస్కాంతాలు తొలగించారు. ల్యాప్రొస్కోపిక్ సర్జన్ తరుణ్ మిట్టల్ ఆధ్వర్యంలోని వైద్య బృందం రోగికి శస్త్రచికిత్స చేశారు. రోగి పొట్టలో రెండు, ఐదు రూపాయల విలువున్న 39 నాణేలు, వివిధ పరిమాణాల్లో ఉన్న 37 అయస్కాంతాలను బయటకు తీశారు.