Tomato Charu Recipe In Telugu : మనలో చాలా మందికి అన్నం చివర్లో కాస్త రసంతో తినే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలోనే ఎక్కువ మంది ప్రిపేర్ చేసుకునే వాటిల్లో టమాటా చారు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అయితే, మీరు ఇప్పటి వరకు ఈ చారును అనే విధాలుగా ప్రిపేర్ చేసుకొని ఉంటారు. కానీ, ఎప్పుడైనా ఉడకబెట్టకుండా టమాటాలను మిక్సీ పట్టి చారును ప్రిపేర్ చేసుకున్నారా? లేదంటే ఓసారి ఇలా ట్రై చేయండి. 5 నుంచి 10 నిమిషాల్లో చాలా సింపుల్గా అయిపోతుంది. అంతేకాదు ఉల్లి, వెల్లుల్లి వేయకుండా చేసుకునే ఈ రసం రుచిలోనూ అదుర్స్ అనిపిస్తుంది. మరి, ఈ సింపుల్ అండ్ టేస్టీ టమాటా చారుకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- చింతపండు - చిన్న నిమ్మకాయ సైజంత
- టమాటాలు - 3(మీడియం సైజ్వి)
- అల్లం - అర అంగుళం ముక్క
- నూనె - 2 టేబుల్స్పూన్లు
- మెంతులు - చిటికెడు
- శనగపప్పు - అరటీస్పూన్
- మినప్పప్పు - అరటీస్పూన్
- ఆవాలు - అరటీస్పూన్
- జీలకర్ర - అరటీస్పూన్
- పచ్చిమిర్చి - 2
- ఇంగువ - పావుటీస్పూన్
- ఎండుమిర్చి - 2
- కరివేపాకు - కొద్దిగా
- పసుపు - పావుటీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- కారం - తగినంత
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- సాంబార్ పొడి - 1 టీస్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
నెల్లూరు స్టైల్ "రసం" - ఈ పద్ధతిలో ప్రిపేర్ చేసుకోండి - డైరెక్టుగా రసమే తాగేస్తారు!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక చిన్న బౌల్లో చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి కాసేపు నానబెట్టుకోవాలి. అలాగే, టమాటాలను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు, అల్లం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ చిన్న ముక్కలు మిగిలిపోయిన పర్లేదు కానీ, పెద్ద ముక్కలు ఉండకుండా చూసుకోవాలి.
- అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని పోపుని చక్కగా వేయించుకోవాలి.
- అవి వేగాక ఇంగువ, పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి తుంపలు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని పోపుని మంచిగా వేయించుకోవాలి.
- తాలింపు చక్కగా వేగిందనుకున్నాక పసుపు వేసి కలుపుకోవాలి. ఆపై ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, సాంబార్ పొడి వేసుకొని మరోసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసుకున్న రసాన్ని వేసుకొవాలి. అలాగే చారు పల్చగా ఉండడానికి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి.
- అనంతరం మీడియం ఫ్లేమ్ మీద 3 నుంచి 4 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇక చివర్లో కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకుంటే చాలు. అంతే, నోరూరించే కమ్మని "టమాటా చారు" రెడీ!
- మరి, నచ్చిందా అయితే మీరూ ఓసారి ఇలా టమాటా చారు చేసుకోండి. టేస్ట్ నెక్ట్ లెవల్లో ఉండి తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది.
నోరూరించే "గుమ్మడికాయ పప్పు చారు"- ఇలా చేస్తే రుచి ఎప్పటికీ మర్చిపోలేరు!