Shirdi Sai Baba Temple Meals Token : శిర్డీ సాయిబాబా భక్తులకు అలర్ట్. సాయి ప్రసాదాలయం నిబంధనలలో కీలక మార్పులు చేసింది సాయిబాబా సంస్థాన్. మద్యపానం, ధూమపానం, నేర ప్రవృత్తి ఉన్నవారిని అరికట్టేందుకు ప్రసాదాలయంలో టోకెన్ వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించింది. సాయి దర్శనం తర్వాత ఉచిత భోజన టోకెన్లను అందించడానికి ఏర్పాట్లు చేసింది. గురువారం(ఫిబ్రవరి 6) ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. ఇప్పుడు టోకెన్ లేకుండా భక్తులు ప్రసాదాలయంలోని ప్రవేశించలేరని సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోరక్ష్ గాడిల్కర్ తెలిపారు.
'రోజుకు 50వేల మందికి ఉచిత భోజనం'
శిర్డీలోని సాయి బాబా సంస్థాన్ ఆధ్వర్యంలో నడిచే భోజనశాలలో రోజుకు సగటున యాభై వేల మంది భక్తులు ఉచిత సాయి ప్రసాదాన్ని తింటున్నారని చెప్పారు గోరక్ష్ గాడిల్కర్. అదే సమయంలో నేర ప్రవృత్తి ఉన్నవారు, డ్రగ్స్ బానిసలు, ధూమపానం చేసేవారు కూడా భోజనశాలలోకి ప్రవేశించి తింటున్నారని ఫిర్యాదులు అందుతున్నాయని వెల్లడించారు. అందుకే అలాంటివారు భోజనశాలలోకి ప్రవేశించకుండా ఉండేందుకు సాయిబాబా సంస్థాన్ కొన్ని ఆంక్షలు విధించిందని తెలిపారు.
"సాయిబాబా దర్శనం అనంతరం బయటకు వచ్చే భక్తులకు సాయి ప్రసాదాలయంలో ఉచిత భోజన టోకెన్‌తో పాటు విభూది, బూందీ ప్రసాదాన్ని అందిస్తాం. ఒకవేళ దర్శనానికి ముందే భోజనం చేయాలనుకునే భక్తులకు ప్రసాదాలయంలో ఉచితంగా టోకెన్లు అందజేస్తాం. సాయి సంస్థాన్ ఆధ్వర్యంలో నడిచే రెండు ఆస్పత్రుల రోగులు, వారి కుటుంబీకులకు వసతి ఏర్పాట్లు చేస్తాం. అలాగే ఉచిత భోజన టోకెన్లు కూడా ఇస్తాం. శిర్డీకి వచ్చే ఏ భక్తుడూ ఆకలితో ఉండరు." అని సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోరక్ష్ గాడిల్కర్ పేర్కొన్నారు.
ఇద్దరు ఉద్యోగుల హత్య నేపథ్యంలో అలర్ట్
ఇటీవలే సాయి సంస్థాన్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు దారుణ హత్యకు గురయ్యారు. దీంతో అక్కడి పరిపాలనా యంత్రాంగం, సాయి సంస్థాన్ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో శిర్డీలో నేరాలను తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ప్రసాదాలయంలో ప్రవేశించేవారికి టోకెన్‌ను తప్పనిసరి చేసింది.
దేశం నలుమూలల నుంచి ప్రజలు ఉచితంగా భోజనం చేసేందుకు శిర్డీకి వస్తుంటారని బీజేపీ మాజీ ఎంపీ సుజయ్ విఖే పాటిల్ ఆరోపించారు. మహారాష్ట్రలోని యాచకులంతా శిర్డీలోనే గుమిగూడారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సాయి ప్రసాదాలయంలో ఉచిత భోజనం ఆపేయాలని, భోజనానికి డబ్బులు వసూలు చేయాలని డిమాండ్లు వచ్చాయి. ఇప్పుడు సాయి సంస్థన్ కీలక మార్పులు చేపట్టింది.