District Collector visits 10th Student House : పదో తరగతి ఫలితాల్లో 100 శాతం సాధించడమే లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు "విద్యార్థుల ఇంటి తలుపు తట్టే" కార్యక్రమాన్ని సంస్థాన్ నారాయణపురం మండలం కంకణాల గూడెంలో ప్రారంభించారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థుల హాస్టల్లో ( వసతి గృహం) బుధవారం రాత్రి బస చేసిన కలెక్టర్, అక్కడి పదో తరగతి విద్యార్థులతో కాసేపు మాట్లాడి ప్రేరణ కలిగించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం అక్కడే నిద్రపోయారు.
విద్యార్థి ఇంటి తలుపు తట్టిన కలెక్టర్ : మరుసటి రోజు గురువారం తెల్లవారుజామున 5 గంటలకే 3 కి.మీ దూరంలోని చిన్న పల్లెటూరును కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. విద్యా స్థాయిలో 'సి' గ్రేడ్‌లో ఉన్నటువంటి దేవరకొండ భరత్ చంద్ర అనే విద్యార్థి ఇంటికి ఆయన వెళ్లారు. అతని ఇంటి తలుపు తట్టారు. తాను జిల్లా కలెక్టర్‌ను అని పరిచయం చేసుకొని విద్యార్థితో పాటు అతని తల్లితో మాట్లాడారు. 50 రోజుల పాటు ప్రణాళిక బద్దంగా కృషి చేసి చదివితే పదో తరగతిలో ఉత్తీర్ణుడయ్యే అవకాశం ఉందని వివరించారు.
తన గొప్ప మనసు చాటుకున్న పాలనాధికారి : విద్యార్థి పోషకాహార లోపంతో బలహీనంగా ఉండడాన్ని గుర్తించిన కలెక్టర్ హనుమంతరావు, అతని పోషణ కోసం నెలకు రూ.5000 చొప్పున తన సొంత డబ్బులు అందిస్తానని ప్రకటించి అప్పటికప్పుడే ఆ డబ్బులు అందజేశారు. విద్యార్థి చదువుకునేందుకు స్టడీ ఛైర్, ఫ్లాంక్, రాత పుస్తకాలు, పెన్నులను బహుమతిగా అందించారు. పంచాయతీ కార్యదర్శి సుభాస్‌కు విద్యార్థి చదువును, అతని అవసరాలను పర్యవేక్షించాలని బాధ్యతను అప్పగించారు.
కలెక్టర్ గారి గ్రౌండ్ బేసిక్ లెర్నింగ్‌తో - బట్టీ చదువులకు విద్యార్థుల స్వస్తి
టీచర్ అవతారమెత్తిన కలెక్టర్ - ఇంటర్ విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు