Virat Kohli Injury : 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కీలక ఆటగాళ్ల గాయాలు భారత్‌కు ఆందోళనగా మారాయి. ఇంతకుముందే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఇప్పుడు కీలక బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ జాబితాలో చేరారు. గురువారం నాగ్‌పుర్‌లో మొదలైన భారత్- ఇంగ్లాండ్ మొదటి వన్డేకి కోహ్లీ దూరమయ్యాడు. అతడు కుడి మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అయితే కోహ్లీ గాయం తీవ్రతపై స్పష్టత లేదు. టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ అతడు త్వరగా కోలుకుంటాడని భావిస్తోంది.
పాక్ వేదికగా ఫిబ్రవరి 19న ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు కానుంది. ప్రస్తుతం భారత్ చివరి దశ సన్నాహాల్లో ఉంది. ఫిబ్రవరి 20 నుంచి దుబాయ్‌లో భారత్ మ్యాచ్‌లు జరుగుతాయి.
కోహ్లీ ఆడకపోవడం ఆశ్చర్యమే!
కోహ్లీ మొదటి వన్డే ఆడటం లేదని టాస్ సమయంలో రోహిత్ చెప్పాడు. దురదృష్టవశాత్తూ, నిన్న రాత్రి తలెత్తిన కుడి మోకాలిలో సమస్యతో కోహ్లీ ఆడడం లేదని స్పష్టం చేశాడు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా-బీసీసీఐ కూడా కోహ్లీ అందుబాటులో లేడని ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతకు మించి గాయం తీవ్రత, అందుబాటులోకి వచ్చే సమయం గురించి వెల్లడింలేదు.
ప్రాక్టీస్ సమయంలో అసౌకర్యం
బుధవారం నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కోహ్లీ అసౌకర్యానికి గురైనట్లు సమాచారం. గురువారం మ్యాచ్‌కు ముందు కొన్ని షటిల్ స్ప్రింట్లు చేస్తున్నప్పుడు కోహ్లి కుడి మోకాలికి పెద్ద పట్టీ ఉంది. కోహ్లీని టీమ్ ఫిజియో కమలేష్ జైన్ నిశితంగా పరిశీలిస్తుండటం కనిపించింది.
ఇప్పటి వరకు కోహ్లీ స్కానింగ్ చేయించుకోలేదు. నేషనల్ క్రికెట్ అకాడమీ-NCAలో చెక్-అప్ కోసం బెంగళూరుకు వెళ్తాడా లేదా ఫిబ్రవరి 9న కటక్‌లో జరిగే రెండో వన్డేకు అందుబాటులోకి వస్తాడా? అనేది చూడాలి. సిరీస్‌లో చివరి మూడో వన్డే ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో జరుగుతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి ఇక కొన్ని వారాలే మిగిలి ఉంది. ఫిబ్రవరి 20న దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో మొదటి మ్యాచ్ ఆడుతుంది. అప్పటిలోగా విరాట్ కోహ్లీ కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.