Pension Scheme For Gig Workers : దేశంలోని వివిధ ఆన్‌లైన్ వేదికల్లో పనిచేస్తున్న కోటి మందికిపైగా గిగ్ వర్కర్లకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించనుంది! వారి కోసం ప్రత్యేక పింఛను పథకాన్ని అమలు చేసేందుకు మోదీ సర్కారు సన్నద్ధం అవుతోంది. త్వరలోనే ఈ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ పరిశీలనకు కార్మిక శాఖ పంపనున్నట్లు తెలుస్తోంది. గిగ్ వర్కర్లు విధి నిర్వహణ క్రమంలో చేసే ప్రతి లావాదేవీలో నుంచి కొంత మొత్తాన్ని 'సామాజిక భద్రతా చెల్లింపు' కింద పింఛను ఖాతాలో జమ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
ఆర్థిక అవసరాల కోసం కొన్ని రోజులు లేదా కొన్ని గంటలు స్విగ్గీ, ర్యాపిడో, ఓలా, జొమాటో, ఉబెర్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ సర్వీసుల్లో పనిచేసే వారిని 'గిగ్ వర్కర్లు' అంటారు. వీరి పని తాత్కాలికం, ఆదాయమూ తాత్కాలికమే. నెలవారీ వేతనం లభించదు.
ప్రతి లావాదేవీలో నిర్దిష్ట మొత్తం పింఛనుకు
అందుకే గిగ్ వర్కర్ల ద్వారా జరిగే ప్రతి సర్వీసు లావాదేవీ నుంచి 'సామాజిక భద్రతా చెల్లింపు' కోసం ఎప్పటికప్పుడు నిర్దిష్ట శాతంలో మొత్తాన్ని కేంద్ర కార్మికశాఖ స్వీకరించనుంది. ప్రతి లావాదేవీపై ఎంత శాతాన్ని పింఛను కోసం సేకరించాలనే దానిపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయాన్ని తీసుకోలేదు. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) తరహాలో ఈ మొత్తాన్ని ఆన్‌లైన్ సర్వీసుల సంస్థల బిల్లుల నుంచి నిర్బంధంగా సేకరిస్తారు. గిగ్ వర్కర్లు రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆన్‌లైన్ సర్వీసుల కోసం పనిచేసినా ఈ పింఛను పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు.
విత్‌డ్రాకు రెండు ఆప్షన్లు
పింఛను ఖాతాలో జమయ్యే డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు గిగ్ వర్కర్లకు రెండు ఆప్షన్లు ఇవ్వనున్నారు. పదవీ విరమణ పొందేే సమయానికి పింఛను ఖాతాలో జమయ్యే డబ్బుపై వచ్చిన వడ్డీ ఆదాయాన్ని విత్ డ్రా చేసుకోవడం మొదటి ఆప్షన్. పింఛను ఖాతాలో జమైన డబ్బును కొన్ని ఈఎంఐలుగా విభజించుకొని, విడతలవారీగా ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలోకి పొందడం రెండో ఆప్షన్.
కేంద్ర బడ్జెట్‌లోనూ వరాలు
ఇటీవలే కేంద్ర బడ్జెట్‌లోనూ గిగ్ వర్కర్లకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేశారు. వారికి గుర్తింపు కార్డులను అందించడం సహా ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. 'ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన' ద్వారా వారికి ఆరోగ్య భద్రత కల్పిస్తామని నిర్మల వెల్లడించారు. రానున్న రోజుల్లో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి కూడా గిగ్ వర్కర్లు లబ్ధి పొందొచ్చు.
ఈ-శ్రమ్ పోర్టల్‌తో ఎంతో లబ్ధి
ఈ-శ్రమ్ పోర్టల్‌ను 2021 ఆగస్టులో ప్రారంభించారు. అసంఘటిత రంగంలోని కార్మికుల వివరాల నమోదు కోసం, వారికి సహాయ సహకారాలను అందించేందుకు దీన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా ఇప్పటికే చాలామంది కార్మికులకు యూనివర్సల్ అకౌంట్ నంబర్-UAN నంబరును మంజూరు చేశారు. అసంఘటిత రంగ కార్మికుల వివరాలతో నేషనల్ డేటాబేస్ ఆఫ్ అన్ ఆర్గనైజ్డ్ వర్కర్స్-NDUWను రూపొందించారు. 2025 జనవరి 27 నాటికి దేశవ్యాప్తంగా 30.58 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్‌లో వివరాలను నమోదు చేసుకున్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన 12 పథకాలను దీనితో ఏకీకృతం చేశారు.