TS Govt on Dharani Scam : 2018లో నాటి ప్రభుత్వం భూ సంబంధిత సమస్యల పరిష్కారంతో పాటు క్రయవిక్రయాలు సులభతరం చేసేందుకు ధరణి పోర్టల్ తీసుకొచ్చింది. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా క్షేత్రస్థాయిలో ఇష్టానుసారంగా భూ వివరాలు పోర్టల్లో అప్‌లోడ్ చేయడం, భూహక్కులు కలిగి ఉన్న రైతుల ఆధీనంలోని భూములు సైతం నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. పొరపాట్లను సరిదిద్దేందుకు ఎక్కడో మారుమూల ఉన్న అన్నదాతలు సైతం హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఎ కార్యాలయానికి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లు పైరవీలతో భూములను నిషేధిత జాబితా నుంచి తీయించుకోగలిగారు.
Dharani Committee Interim Report : కానీ చిన్న, సన్నకారు రైతులు మాత్రం తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, సీసీఎల్‌ఎ కార్యాలయాల చుట్టూ తిరిగినా పనులు కాలేదు. కలెక్టర్లకు అధికారాల బదలాయింపు, కొన్నిమాడ్యూల్స్‌లో మార్పు చేసినా పూర్తిస్థాయిలో ధరణి సమస్యలు తీరలేదు. ప్రతిపక్షంలో ఉన్న నాటి కాంగ్రెస్ 20 లక్షల మందికి పైగా అన్నదాతల బాధలను చూసి, తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని, దాని స్థానంలో అంతకంటే మరింత మెరుగైన వ్యవస్థను తెస్తామని హామీ ఇచ్చింది.
Dharani Portal Problems 2024 : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. భూ నిపుణులైన కోదండరెడ్డి, రేమాండ్ పీటర్, సునీల్ కుమార్, మధుసూదన్‌లతో కమిటీ వేసిన సర్కార్ సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ కమిటీ అనేకసార్లు కలెక్టర్లు, దేవాదాయ, అటవీ, వక్ఫ్, భూదాన్ బోర్డు, వ్యవసాయ శాఖలకు చెందిన అధికారులతోనూ సమావేశాలు నిర్వహించింది. క్షేత్రస్థాయిలో పర్యటించి ధరణి సమస్యలపై కమిటీ సభ్యులు లోతైన అధ్యయనం చేశారు.
మధ్యంతర నివేదికలో 123 సమస్యల గుర్తింపు : ప్రభుత్వానికి ఇచ్చిన మధ్యంతర నివేదికలో 123 సమస్యలను గుర్తించినట్లు పేర్కొన్నారు. దిగువ స్థాయిలో అప్పీలేట్ అథారిటీ లేకపోవడం అతి పెద్ద లోటుగా తేల్చింది. ఎక్కువ సమస్యలు కలెక్టర్‌తో సంబంధం లేకుండా మండల, రెవెన్యూ డివిజన్‌ల స్థాయిలోనే పరిష్కరించవచ్చని కమిటీ గుర్తించింది. దశాబ్దాలుగా రైతులు సాగుచేస్తున్నా ఫిజికల్ రికార్డులు, పోర్టల్ డిజిటలైజ్‌డ్ వెర్షన్‌లో సరిపోలకపోవడం వల్ల కొన్నిభూములు నిషిద్ధ జాబితాలోకి చేర్చారని తేల్చింది. రెండున్నర లక్షల దరఖాస్తుల పరిష్కారం కోసం తెలంగాణ సర్కార్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, దాదాపు 70 శాతం అర్జీలకు మోక్షం కల్పించినట్లు కమిటీ వెల్లడించింది.
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం - ధరణి సమస్యల పరిష్కారానికి అధికారాల బదలాయింపు