Key Agreement In Davos On Huge Investments In Telangana : తెలంగాణ రైజింగ్ పేరుతో మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్‌లో చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. దావోస్‌లో మరో కీలక ఒప్పందం జరిగింది. రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ ఎంవోయూ చేసుకుంది. భారీ పంప్‌డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుపై ఒప్పందం జరిగింది. నాగర్‌కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. సన్ పెట్రో కెమికల్స్ ప్రాజెక్టులతో 7,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.
దీంతో పాటు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ సంస్థ 10,000 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్‌ను నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. దావోస్‌లో ఐటీ శాఖమంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఉన్నతాధికారులు, కంట్రోల్ ఎస్ సీఈవో శ్రీధర్ పిన్నపురెడ్డి ఒప్పందంపై సంతకాలు చేశారు. 400 మెగావాట్లతో కంట్రోల్ ఎస్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ క్లస్టర్ ద్వారా 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. జేఎస్‌డబ్ల్యూ సంస్థ డ్రోన్ టెక్నాలజీ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది.
హైటెక్ సిటీలో హెచ్సీల్ టెక్ ఏర్పాటు : ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్ హైదరాబాద్‌లో కొత్త టెక్ సెంటర్‌ను ప్రారంభించనుంది. ఈ మేరకు దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబుతో హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ సి.విజయకుమార్ జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. హెచ్‌సీఎల్ కొత్త సెంటర్ లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, క్లౌడ్, ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సొల్యూషన్‌లను అందిస్తుంది. హైటెక్ సిటీలో 3లక్షల 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సీల్ టెక్ ఏర్పాటు చేసే క్యాంపస్‌లో దాదాపు 5000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయి. వచ్చే నెలలో ఈ సెంటర్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి, ఐటీ మంత్రులను హెచ్సీల్ టెక్ సీఈవో విజయకుమార్ ఆహ్వానించారు. హెచ్సీల్ టెక్ విస్తరణ చేపట్టడాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు.
రవాణ వ్యవస్థలో పెట్టుబడులు పెట్టండి : రీఇమాజినింగ్ అర్బన్ మొబిలిటీ అనే అంశంపై సీఐఐ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బస్సు, రైలులో ప్రయాణించే ఆర్థిక పరిస్థితి చాలా మందికి ఉండదనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం సుమారు 2కోట్ల మంది మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినట్లు సీఎం వివరించారు. తెలంగాణ పట్టణ రవాణ వ్యవస్థలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పారిశ్రామికవేత్తలను కోరారు. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ 160 కిలోమీటర్ల ఔటర్ రింగు రోడ్డు ఉండగా, 360 కిలోమీటర్ల ప్రాంతీయ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నట్లు చెప్పారు. రెండు రింగ్ రోడ్లను కలుపుతూ రేడియల్ రోడ్లు కూడా నిర్మించి, వాటికి అనుబంధంగా రింగ్ రైల్వే లైను నిర్మించే ఆలోచన ఉన్నట్లు చెప్పారు.
"మేము కొత్త ఫ్యూచర్ సిటీని నెట్ జీరో సిటీగా నిర్మిస్తున్నాం. ఆ నగరంలో ప్రపంచ ఉత్తమ రవాణా వ్యవస్థను నిర్మించాలని కోరుకుంటున్నాం. మా ప్రజలు వేగంగా, తక్కువ ధరలో, భరించతగిన విధంగా ప్రయాణించే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. తెలంగాణ వ్యాప్తంగా 4 కోట్ల మంది ప్రజలు వేగంగా, హరిత పద్దతిలో, తక్కువ ధరలో ప్రయాణించేలా పట్టణ రవాణా వసతులు కల్పించేందుకు పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నాను."- రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
తెలంగాణలో యూనిలివర్ పెట్టుబడులు - సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో పలు ఒప్పందాలు