Investment Fraud In Hyderabad : రోజురోజుకూ నగరంలో మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు చాలా రకాలుగా ప్రజలను చైతన్య పరుస్తున్నా కొంతమంది మోసగాళ్లకు చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే 40 శాతం షేర్లు ఇస్తానని రూ.కోట్లలో మోసం చేశాడు ఓ కేటుగాడు.
పెట్టుబడులకు వాటాలు ఇస్తానని : తన కంపెనీలో పెట్టుబడులకు వాటాలు ఇస్తానని రూ.కోట్లలో మోసగించిన కేటుగాడు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసులకు చిక్కాడు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ సుధీంద్ర శనివారం ఓ ప్రకటనలో కేసు వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటకు చెందిన కస్వరాజు హిరణ్మహి రేషన్ బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించాడు. శౌచాలయాల్ని శుభ్రం చేసే ద్రవాలను తయారు చేస్తున్నామని ప్రకటించాడు. తెలిసిన వ్యక్తి ద్వారా హిరణ్మహికి 2021లో విశ్రాంత డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ సుభాష్ పరిచయమయ్యారు. తన కంపెనీ టర్నోవర్ 2024 నాటికి రూ.100 కోట్లకు చేరుతుందని, పెట్టుబడులు పెట్టాలని సూచించాడు. 40 శాతం షేర్లు ఇస్తానని నమ్మించాడు.
అరెస్ట్ చేసి రిమాండ్‌కు : నిజమేనని భావించిన సుభాష్ 2023లో రూ.74 లక్షల పెట్టుబడి పెట్టారు. వాటా అడిగితే డబ్బు చెల్లిస్తానని హామీ ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడు. బ్యాంకు చెక్కులిచ్చినా ఖాతాల్లో డబ్బులేదు. హిరణ్మహి సుభాష్‌తో పాటు నోవాయిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధి స్వరూప్, ఎకో నెక్సస్ క్లీనర్స్ ప్రతినిధి మెహ్రానూ మోసగించాడు. మొత్తం ఆరుగురు పెట్టుబడిదారుల్ని రూ.1.96 కోట్లు మోసగించాడు. బాధితుల ఫిర్యాదుతో సీసీఎస్‌లో కేసు నమోదైంది. టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ బృందాలు పరారీలోని నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించాయి.
మోసాలను అరికట్టేందుకు జాగ్రత్తలు : గుర్తుతెలియని వ్యక్తులు పెట్టుబడులతో అధిక లాభాలు వస్తాయంటూ మోసాలు చేస్తారు. అలాంటి వారిన నమ్మొద్దు. ఇటీవల కాలంలో చాలా మంది ఆటోపే ఆప్షన్ వినియోగించడంతో ఈ తరహా మోసాలు వెలుగు చూస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మంది తమ ఫోన్ నంబర్లను యూపీఐ ఐడీలుగా ఉంచుకుంటున్నారు. అయితే ఇలాంటి వారందరినీ చాలా సులభంగా మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటారని, తద్వారా మన ఫోన్ నంబరున్న యూపీఐ ఐడీకి వివిధ రకాల మెసేజ్‌లు పంపిస్తుంటారని చెబుతున్నారు. ఇందులో తెలియకుండా ఏ లింక్ క్లిక్ చేసినా అంతే సంగతులని హెచ్చరిస్తున్నారు.
మేము చెప్పినట్టు చేయండి అధిక లాభాలు వస్తాయన్నారు - రూ.2.43 కోట్లు కొట్టేశారు