Student Gives Birth In College Toilet : కాలేజీ మరుగుదొడ్డిలోనే బిడ్డకు జన్మనిచ్చింది ఓ విద్యార్థిని. అనంతరం యూట్యూబ్ వీడియో చూసి బొడ్డు కత్తిరించి, శిశువును చెత్త కుండీలో పడేసింది. తమిళనాడులోని తంజావూర్‌లో జిల్లాలో జరిగిందీ అమానవీయ ఘటన.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కుంభకోణంలోని ఓ ప్రభుత్వ మహిళా కళాశాలలో చదువుతున్న ఓ 20 ఏళ్ల విద్యార్థిని గర్భం దాల్చింది. కానీ ఆ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడింది. శుక్రవారం తరగతిలో గదిలో ఉండగా, అకస్మాత్తుగా ప్రసవ నొప్పులు వచ్చాయి. వెంటనే ఆ విద్యార్థిని కాలేజీలోని బాత్రూమ్కు వెళ్లి ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
యూట్యూబ్ వీడియోలు చూసి, బోడ్డు కత్తిరించి, తరువాత ఆ పసికందును కళాశాల ఆవరణలో ఉన్న ఓ చెత్తకుండీలో పడేసి, చెత్తతో కప్పేసింది. ఏం తెలియనట్లు క్లాస్ రూంలోకి వచ్చి కూర్చుంది. అధికంగా రక్తస్రావం జరగడం వల్ల అకస్మాత్తుగా ఆ విద్యార్థిని స్పృహ కోల్పోయింది. వెంటనే తోటి విద్యార్థినులు అధ్యాపకులు కలిసి హుటాహుటిన ఆమెను అంబులెన్స్‌లో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విద్యార్థినిని పరిశీలించిన వైద్యులు, ఆమెకు ప్రసవం అయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోనికి దిగిన పోలీసులు కళాశాల అధ్యాపకులను అలర్ట్ చేశారు. వీరంతా వెతకగా కళాశాల ఆవరణలోని చెత్తకుండీలో ఓ ఆడ బిడ్డ కనిపించింది. వెంటనే ఆ పాపను కూడా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
అమానవీయ ఘటనపై నాచ్చియార్ కోయిల్ మహిళా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. "సదరు విద్యార్థినికి ఇప్పుడు 20 ఏళ్లు. ఆమెకు తన సమీప బంధువుతో ప్రేమలో పడింది. ఆమె తల్లి అనారోగ్యంతో బాధపడుతుండగా, తండ్రి ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతంలో ఉంటున్నారు. దీనితో ఆమె ప్రేమికుడు అప్పుడప్పుడు ఆ ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. ఫలితంగా ఆమెకు గర్భం వచ్చింది. కానీ ఎవరికీ తెలియకుండా ఇద్దరూ జాగ్రత్తపడ్డారు. ఆ అబ్బాయి కూడా మేజరే. అతడు ఈ కళాశాల విద్యార్థినితో ఉన్న సంబంధం నిజమేనని ఒప్పుకున్నాడు. ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పాడు. సదరు కళాశాల విద్యార్థిని తన ప్రియుడిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఇద్దరూ మేజర్లు కావడం వల్ల వారిపై కేసు నమోదు చేయలేదు పోలీసులు" అని చెప్పారు.