MLA Danam Nagender Fire Officials : హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని చింతల్ బస్తీలో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను కూల్చివేస్తున్న అధికారులపై స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్దియా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఖైరతాబాద్ షాదన్ కాలేజీ ఎదురుగా ఫుట్ పాత్ కూల్చివేతలు చేపట్టారు. విషయం తెలుసుకున్న దానం అక్కడి చేరుకొని కూల్చివేతలను వెంటనే ఆపాలని అధికారులను కోరారు.
సీఎం వచ్చే వరకు ఆపండి : స్థానిక ఎమ్మెల్యేకు చెప్పకుండా ఎలా కూల్చివేతలు చేపడతారంటూ అధికారులపై దానం అసహనం వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం జీవనం సాగిస్తున్న పేదవారిపై దౌర్జన్యం చేయడం ఎంటని మండిపడ్డారు. దావోస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని, లేకపోతే అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తామని దానం హెచ్చరించారు.
"ఎమ్మెల్యే అయిన నాకు సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేపడతారు. మీరు కూల్చివేతలు ఆపండి. ఆపకుంటే ఆ బండి ముందు కూర్చోవాలా చెప్పండి. కూల్చివేయాలంటే వంద ఉన్నాయి. నాతో రండి చూపిస్తా మీకు పెద్ద పెద్ద కాంప్లెక్సులు ఉన్నాయి. అవి కూల్చండి ముందు. ఇది మాత్రం ఇప్పుడు ఆపండి లేదంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుంది మీ ఇష్టం. మీరు ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకునేది లేదు. మీ పని ఏమి లేదు. రెండు రోజులు సీఎం గారు వచ్చే వరకు ఆపండి. రెండ్రోజులు ఆపడానికి ఏమి అవుతుంది" - దానం నాగేందర్, ఎమ్మెల్యే
రోడ్డుపై బైఠాయించిన నాంపల్లి ఎమ్మెల్యే : మరోవైపు నాంపల్లిలోనూ ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా రహదారికి ఇరువైపుల అక్రమంగా ఏర్పాటు చేసిన చిరు వ్యాపారుల దుకాణాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. విషయం తెలుసుకున్న నాంపల్లి మజ్లిస్ ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ వెంటనే అక్కడికి వచ్చి తొలిగింపు ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
రెండు వర్గాల మధ్య ఘర్షణకు అవకాశం : పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులతో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి రహదారిపై బైఠాయించడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. కేవలం ఒక వర్గం వారి దుకాణాలనే కూల్చి మిగతా ఆక్రమణలను వదిలేస్తారా? అంటూ కొందరు ఆందోళనకు దిగారు. రెండు వర్గాల మధ్య ఘర్షణకు అవకాశం ఉందని పోలీసులు నచ్చజెప్పడంతో మాజిద్ హుస్సేన్ వెనుదిరిగి వెళ్లిపోయారు.