Kolkata Murder Case Verdict CBI : ఆర్జీ కర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషి సంజయ్ రాయ్‌కు జైల్లో తోటమాలి పని ఇచ్చే అవకాశం ఉందని సీనియర్ అధికారి తెలిపారు. అతడికి జైలులో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు సంజయ్ రాయ్‌కు కోర్టు విధించిన శిక్షపై సీబీఐ అప్పీల్‌కు వెళ్లనుంది. దోషికి ఉరిశిక్ష విధించాలని హైకోర్టును కోరనుంది.
తోటమాలిగా పని
ప్రస్తుతం కోల్‌కతా ప్రెసిడెన్సీ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్ రాయ్‌ను కట్టదిట్టమైన భద్రత ఉండే పొయిలా బాయిష్ బ్లాక్‌లో ఉంచారు. ఇదే బ్లాక్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ ఉన్నారు. హత్యాచారం కేసులో సంజయ్ రాయ్‌కు సియాల్దా కోర్టు జీవిత ఖైదు విధించడం వల్ల అతడు ఇక ఏమాత్రం విచారణ ఖైదీ కాదని జైలు సీనియర్ అధికారి తెలిపారు. అతడికి ప్రత్యేక నైపుణ్యాలు లేకపోవడం వల్ల తోటమాలి పని ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ పనికి అతడికి రోజుకు 105 రూపాయల వేతనం లభిస్తుందని చెప్పారు. ఒకటి లేదా రెండు రోజుల్లో అతడికి ఏదో ఒక పని అప్పగించే అవకాశం ఉందన్నారు.
సంజయ్‌పై ప్రత్యేక నిఘా
మొదట అప్రెంటీస్‌గా సంజయ్ రాయ్ పని నేర్చుకుంటాడని జైలు సీనియర్ అధికారి తెలిపారు. మోస్తరు నైపుణ్యాలు ఉన్నవారికి రోజుకు రూ.120, నైపుణ్యం కలిగిన వారికి రోజుకు రూ.135 వేతనం లభిస్తుందని వెల్లడించారు. కోర్టు శిక్ష విధించిన తర్వాత సంజయ్ రాయ్ అదనంగా మూడు దుప్పట్లు, పుస్తకం, పెన్ను అడిగాడని జైలు అధికారులు తెలిపారు. మెుదటి రోజు సంజయ్ రాయ్ రెండు గంటల పాటు సెల్ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. అతడి ప్రాణానికి ముప్పు ఉండటం వల్ల కదలికలపై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. మరోవైపు, తాము ఇచ్చిన తీర్పుపై కోల్‌కతా హైకోర్టులో అప్పీలు చేసుకునే హక్కు దోషి సంజయ్ రాయ్‌కు ఉంటుందని సియాల్దా అదనపు జిల్లా సెషన్స్ కోర్డు జడ్జి తెలిపారు. అయితే ఇప్పటి వరకు సంజయ్ రాయ్ సియాల్దా కోర్టు తీర్పును సవాల్ చేయలేదు.
ఇది అరుదైన కేసే!
ఈ కేసులో సియాల్దా కోర్టు ఇచ్చిన తీర్పుపై కలకత్తా హైకోర్టులో అప్పీల్ చేసేందుకు సీబీఐ సిద్ధమైంది. ఈ కేసు అత్యంత అరుదైన నేరం కేటగిరీలోకి వస్తుందని, మరణశిక్షకు అర్హమైనదేనంటూ సీబీఐకి న్యాయ సలహా అందింది. దీనితో దోషికి మరణ దండన విధించాలని సీబీఐ హైకోర్టును కోరడానికి సిద్ధమైంది. ఇందుకోసం త్వరలోనే అప్పీల్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సీబీఐ అధికారులు పేర్కొన్నారు. దోషికి ఉరిశిక్ష వేయాలంటూ ఇప్పటికే బంగాల్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయిచింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుపై నిర్ణయం తీసుకునే ముందు - సీబీఐ, బాధితురాలి కుటుంబం, దోషి వాదలను వింటామని హైకోర్టు తెలిపింది. దీనిపై జనవరి 27న విచారణ చేపడతామని పేర్కొంది.