Two-Wheelers Theft in Hyderabad City : గ్రామీణ ప్రాంతాల్లో బైకు లేదా కారు తక్కువ ధరకే దొరకుతుందా? మీరు అనుకున్న ధరకంటే తక్కువకే ఇస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! ఆ బైక్ చోరీ చేసి విక్రయించిందయి ఉండవచ్చు. లేదా ఏదైనా నేరంలో దాన్ని ఉపయోగించి ఉండొచ్చు. సిటీ పోలీసులు ఇప్పుడు ఇదే విషయం చెబుతున్నారు. తక్కువ ధరకు వస్తుందని తొందరపడి కొన్నారో ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. గత ఏడాది కాలంగా హైదరాబాద్ నగరంలో ద్విచక్ర వాహనాల చోరీలు పెరుగుతున్నాయి. ఇక్కడ చోరీ చేసి గ్రామీణ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో నేరగాళ్లు వాటిని విక్రయిస్తున్నారు. ఏడాది వ్యవధిలోనే 4 వేలకు పైగా బైక్ చోరీలు జరిగినట్లు పోలీసుల గణాంకాలు చెబుతున్నాయి.
బయట పార్కింగ్ చేయడంతోనే : మణికొండలో ఓ వ్యక్తి దుకాణం వద్ద వాహనం నిలిపి లోపలకు వెళ్లి బయటకు వచ్చేలోపు ఆ వాహనం మాయమైంది. పాతబస్తీలో ఇంటి బయట ఉంచిన ఆటోను కూడా దుండగులు వదలలేదు. కుషాయిగూడలో సురక్షితమని భావించే ప్రదేశంలో ఉంచిన కారు కనిపించకుండా పోయింది. ఇలా గ్రేటర్ పరిధిలో ఏటేటా వాహన చోరీలు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి వద్ద బైక్ లేదా కారు ఉంటోంది. దీంతో అపార్ట్మెంట్ లోపల నిలిపేందుకు అనువైన చోటులేక ఆరుబయటే ఉంచాల్సిన దుస్థితి నెలకొంది. దీన్ని ఆసరా చేసుకొని దొంగలు రెచ్చిపోతున్నారు. నిమిషాల వ్యవధిలో ఖరీదైన వాహనాలను మాయం చేస్తున్నారు. కొందరైతే నెంబరు ప్లేటు మార్చి వాడుతున్నారు.
నాలుగేళ్లలో 19వేల వాహనాలు మాయం : మరికొంత మంది దొంగలు వీటిని ఇతర ప్రాంతాల్లో విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో నాలుగేళ్ల వ్యవధిలో 19వేల వాహనాలు మాయమైనట్టు కేసులు నమోదయ్యాయి. పోలీసు గణాంకాల ప్రకారం నగరంలో రోజూ 10కి పైగా వాహనాలు చోరీకి గురవుతున్నాయి. వీటిలో అధిక శాతం ఇల్లు, దుకాణాల బయట నిలిపినవే కావటం గమనార్హం. నగరంలో 50 శాతం ద్విచక్రవాహన చోరీల్లో మైనర్లే పట్టుపడుతున్నారు. బైక్ నడపాలనే మోజు, మరోపక్క ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండటంతో, ద్విచక్ర వాహనాలను నడపాలనే కోరికతో నేరాల బాటపడుతున్నారు.
"హైదరాబాద్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పరంగా చూస్తే జనాలు ఎక్కువగా జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళుతున్నారు. ఊరికి వెళ్లినపుడు త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో వారి ద్విచక్ర వాహనాలను అక్కడి ప్రదేశాలలో పెట్టి వెళ్లిపోతున్నారు. వారు మళ్లీ రిటన్ వచ్చినపుడు ఆ వాహనం ఉండటం లేదు" -సాధన రష్మీ, డీసీపీ
గ్రామీణ ప్రాంతాల్లో విక్రయం : అపార్ట్మెంట్, నివాస ప్రాంతాల్లో బయట ఉంచిన బైక్లను నకిలీ తాళాలతో చాకచక్యంగా మాయం చేస్తున్నారు. కొందరు ఆ వాహనంలో పెట్రోల్ ట్యాంకు ఖాళీ అయేంత వరకు ఇంకొందరు దానిపై మోజు తీరేంత వరకూ చక్కర్లు కొడుతున్నారు. సిగరెట్, మద్యం, సెల్ఫోన్ల కోసం బండ్ల తుక్కు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. జేబులు ఖాళీ అవగానే మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పార్కింగ్ ప్రదేశాలు, రోడ్లపై గంటల తరబడి నిలిపి ఉంచిన వాహనాలను ముందుగా రెక్కీ నిర్వహించి గుర్తిస్తారు. కొందరు వాహనాల నెంబర్ ప్లేటు మార్చి, నకిలీ ఆర్సీలను సృష్టించి, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు చేరవేస్తున్నారు.