Manu Bhakar Grandmother Murder Case : భారత స్టార్ షూటర్ మను భాకర్ అమ్మమ్మ, మేనమామ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది రోడ్డు ప్రమాదం కాదని, వారిని కావాలనే పథకం ప్రకారం హత్య చేశారని మను భాకర్ తల్లి సుమేధ భాకర్ అనుమానం వ్యక్తం చేశారు. తన మేనల్లుడితో కలిసి ఎస్పీని కలిసిన ఆమె, వారికి ఓ సీసీటీవీ ఫుటేజ్‌ను అందజేశారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపి, దోషిని శిక్షించాలని ఆమె పోలీసులను కోరారు.
నిందితుడి అరెస్ట్
జనవరి 19న హరియాణాలోని చర్ఖీ దాదరీలో స్కూటీపై వెళ్తున్న మనుబాకర్ అమ్మమ్మ సావిత్రి దేవి, మేనమామ యుధ్వీర్ను వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది. దీనితో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దీనితో నిందితుడు కారును విడిచిపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. తరువాత సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అతనిని అరెస్ట్ చేశారు. అతనిని త్వరలో కోర్టులో హాజరుపరచనున్నారు.
హత్యా? యాక్సిడెంటా?
మొదట్లో ఇది రోడ్డు ప్రమాదంగా అందరూ భావించారు. అయితే సీసీటీవీ ఫుటేజ్‌ను బట్టి నిందితుడు కావాలనే కారును వేగంగా నడిపి హత్యలకు పాల్పడ్డాడని మను భాకర్ బంధువులు అనుమానిస్తున్నారు. దీనితో మను భాకర్ తల్లి సుమేధ, యుధ్వీర్ కుమారుడైన సత్పాల్ ఇద్దరూ కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
"నా కూతురు మను భాకర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడింది. తరువాత నేను, నా మేనల్లుడు సత్పాల్తో కలిసి ఎస్పీని కలిశాను. నిందితుడికి చెందిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులకు అందించాను. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి, సరైన చర్యలు తీసుకోవాలని కోరాను."
- సుమేధ, షూటర్ మను భాకర్ తల్లి
"నిందితుడు ఉద్దేశపూర్వకంగానే మా నాన్న, నాన్నమ్మ వెళ్తున్న స్కూటర్‌ను కారుతో ఢీకొట్టాడు. నిందుతుడిపై పోలీసులు కచ్చితంగా చర్య తీసుకోవాలి."
- సత్పాల్, మృతుడు యుధ్వీర్ కుమారుడు
ఈ కేసు కీలక మలుపు తిరిగిన నేపథ్యంలో పోలీసులు దీనిపై దర్యాప్తు ముమ్మరం చేశారు.