AB de Villiers Return to Cricket : సౌతాఫ్రికా మాజీ క్రికెట్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ తన ఫ్యాన్స్‌కి క్రేజీ న్యూస్ చెప్పాడు. మళ్లీ క్రికెట్ ఆడే అవకాశాలు ఉన్నాయని హింట్ ఇచ్చాడు. అయితే ప్రొఫెషనల్ లెవల్ క్రికెట్ మాత్రం కాదని స్పష్టం చేశాడు. 'రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ షో'లో జర్నలిస్ట్ మెలిండా ఫారెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డివిలియర్స్ ఆసక్తికరమైన అంశాలు షేర్ చేసుకున్నాడు. తన పిల్లలతో క్రికెట్ ట్రైనింగ్ సెషన్లో గడపడం వల్ల తనకు మళ్లీ క్రికెట్ ఆడాలనే కోరిక పుట్టిందని వెల్లడించాడు.
'నేను ఏదో ఒక రోజు క్రికెట్ ఆడవచ్చు. ఇప్పటికి ఏదీ కన్ఫార్మ్ కాలేదు. కానీ, క్రికెట్ ఆడాలనే కోరిక పుట్టింది. నా పిల్లలు నాపై కొంచెం ఒత్తిడి పెడుతున్నారు. నేను వారితో కలిసి నెట్స్‌కి వెళ్లవచ్చేమో! నేను ఇదంతా ఆస్వాదించగలిగితే, బయటకు వెళ్లి ఎక్కడైనా నార్మల్ క్రికెట్ ఆడతాను. ఐపీఎల్ లేదా సౌతాఫ్రికా టూర్స్ వంటి ప్రొఫెషనల్ క్రికెట్ అయితే కాదు. ఇదంత పెద్ద నిర్ణయమేమీ కాదు. నేను ఆర్సీబీ వంటి పెద్ద విషయాల గురించి మాట్లాడటం లేదు. ఆ ఒత్తిడిని మళ్లీ అనుభవించకూడదని అనుకుంటున్నాను. ఎక్కడికెళ్లినా కాస్త సరదాగా గడుపుతాను' అని తెలిపాడు.
డివిలియర్స్‌కి ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా భారత్‌లో చాలా మంది అభిమానులు ఉన్నారు. అన్ని వైపులా భారీ షాట్లు ఆడే డివిలియర్స్‌ని ముద్దుగా 'మిస్టర్ 360' అని పిలుచుకుంటారు. సుదీర్ఘకాలం టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ కోహ్లితో కలిసి ఆర్సీబీ తరఫున ఐపీఎల్ ఆడాడు. అతడు 2021 నవంబర్‌లో అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. చివరిసారిగా 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) తరఫున కాంపిటీటివ్ క్రికెట్ ఆడాడు. అతడి చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2018లో ఆడాడు.
అన్ని ఫార్మాట్లలో డివిలియర్స్ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 50.66 యారేజ్‌తో 8,765 పరుగులు చేశాడు. వన్డే ఇంటర్నేషనల్స్‌లో 53.50 యావరేజ్‌తో 9,577 పరుగులు చేశాడు. T20Iలో 26.12 యావరేజ్‌తో 1672 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 39.71 యావరేజ్‌తో ఏకంగా 5162 రన్స్ చేయడం గమనార్హం.
ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లో డివిలియర్స్- ఫ్రెండ్ కోసం విరాట్ స్పెషల్ లెటర్
'దిల్లీ బాయ్ రీఎంట్రీ కోసం నేనూ వెయిట్ చేస్తున్నా- మా ఇద్దరి జెర్సీ నెం. కూడా ఒకటే'