Fermented Curd Rice for Diabetes: మనలో చాలా మంది రాత్రిపూట అన్నం మిగిలితే అందులో నీళ్లు పోసో లేదా పాలు పోసి తోడు పెట్టో చద్దన్నం చేసుకుంటుంటారు. ఆ తర్వాత మర్నాడు ఉల్లిపాయో, పచ్చిమిర్చో నంజుకొని తింటే అల్పాహారం పూర్తవుతుంది. ఇంకా కొందరేమో మిగిలిన అన్నాన్ని మర్నాడు పోపన్నంగా చేసుకొని తింటుంటారు. అయితే, ఈ పోపులో పల్లీలు, సెనగల వంటివి చేర్చితే ప్రొటీన్ కూడా లభిస్తుందని నిపుణులు అంటుంటారు. అన్నమే కాకుండా రాత్రి మిగిలిన చపాతీలను కూడా ఉదయం తిరిగి వేడి చేసో లేదూ టీ, కాఫీ, పాలలో ముంచుకునో తింటుంటారు. ఇలా చేయడం ఆహారం వృథా కాకుండా చూసుకోవటానికే కాకుండా ఆరోగ్యానికీ మేలు చేస్తుందని వెల్లడిస్తున్నారు. పేగులు ఆరోగ్యంగా ఉండటానికి, రక్తంలో గ్లూకోజు మోతాదుల నియంత్రణకు, చివరికి బరువు తగ్గటానికీ తోడ్పడుతుందని నిపుణులు వివరిస్తున్నారు. వండాక కొద్ది గంటల సేపు చల్లారిన లేదా ఫ్రిజ్‌లో పెట్టి చల్లారిన తర్వాత అన్నం, చపాతీల వంటి వాటిల్లోని సరళ పిండి పదార్థం సంక్లిష్టంగా, కఠినంగా (రెసిస్టెన్స్ స్టార్చ్) మారటమే దీనికి కారణమని తెలిపారు.
"రాత్రిపూట నీటిలో లేదా తోడు పెట్టిన పాలలో అన్నాన్ని వేసినప్పుడు అది కాస్త పులుస్తుంది. దీన్ని ఉదయాన్నే తింటే శరీరానికి చలువ చేస్తుంది. ఫలితంగా త్వరగా ఆకలి, దాహం వేయకుండానూ చూస్తుంది. ఇది ఏ కాలంలోనైనా మేలే గానీ ఎండాకాలంలో మరింత బాగా సహాయపడుతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేయటం ఇందులోని మరో మంచి గుణం. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచటంతో పాటు రోగనిరోధకశక్తిని కూడా పెంపొందిస్తుంది. శరీరానికి మంచి బలాన్ని కలగజేసి చెమట పొక్కులను నివారిస్తుంది. జీర్ణాశయంలో ఆమ్ల గుణాన్ని తగ్గించి.. పేగుల కదలికలను మెరుగు పరుస్తుంది. చద్దన్నంతో పాటు ఉల్లిపాయనూ నంజుకుంటే.. శరీరానికి తగినంత పీచూ లభిస్తుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య దరిజేరదు. పులిసిన ఆహారం కావటం వల్ల మానసిక ఆందోళనా తగ్గుతుంది."
--డాక్టర్ పెరుగు శ్రీకాంత్ బాబు, పి.జి. ప్రొఫెసర్, కాయ చికిత్స విభాగాధిపతి, డా. బీఆర్‌కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, హైదరాబాద్
ఏంటీ దీని ప్రత్యేకత?
అన్నం, చపాతీల వంటివి చల్లారినప్పుడు వాటి పిండి పదార్థంలోని అణువులు దగ్గర దగ్గరకు చేరుకొని అతుక్కుంటాయట. ఈ ప్రతిచర్యే పిండి పదార్థం కఠినంగా మారటానికి దోహదపడుతుందని నిపుణులు తెలిపారు. తిరిగి వేడి చేసినా అది అలాగే ఉంటుందట. ఈ కఠిన పిండి పదార్థం త్వరగా అరగదని.. ఫలితంగా వెంటనే రక్తంలో గ్లూకోజు పెరగదని నిపుణులు అంటున్నారు. ఉన్నట్టుండి గ్లూకోజు మోతాదులు పెరిగే ముప్పు దీంతో 40-50% తక్కువని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సంక్లిష్టంగా మారిన పిండి పదార్థం చిన్న పేగుల్లో జీర్ణం కాకుండా పెద్ద పేగులోకి వెళ్తుందని.. అక్కడ విచ్ఛిన్నమై, పులిసిపోతుందని తెలిపారు. ఇది మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా మారుతుందని వివరిస్తున్నారు.

ఇంకా ఇందులో కేలరీలూ తక్కువేనని.. మామూలు పిండి పదార్థంలో ఒక గ్రాముకు 4 కేలరీలుంటే కఠిన పిండి పదార్థంలో 2.5 కేలరీలు మాత్రమే ఉంటాయని చెబుతున్నారు. మరోవైపు ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది కాబట్టి తక్కువగా తినేలా చేస్తుందంటున్నారు. ఫలితంగా బరువు తగ్గటానికి, బరువు అదుపులో ఉండటానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఇది శరీరం ఇన్సులిన్‌కు స్పందించే సామర్థ్యాన్నీ పెంచుతుందని.. ఫలితంగా కణాలు గ్లూకోజును బాగా సంగ్రహిస్తాయని చెప్పారు. దీంతో మధుమేహం, గుండెజబ్బుల వంటి ముప్పులు తగ్గుతాయని సలహా ఇస్తున్నారు. కఠిన పిండి పదార్థం మలాన్ని మృదువుగా చేసి మలబద్ధకాన్ని నివారిస్తుందని.. ఫలితంగా మొలల వంటి జబ్బుల ముప్పూ తగ్గుతుందని తెలిపారు.

"మిగిలిపోయిన అన్నం, చపాతీల్లోని కఠిన పిండి పదార్థం పైన మనదగ్గర పెద్దగా అధ్యయనాలు జరగలేదని.. అలాగని వీటిని పూర్తిగా కొట్టిపారేయనూలేం. వీలైనంతవరకు సంక్లిష్ట పిండి పదార్థంతో కూడిన దంపుడు బియ్యం వంటి ధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయల వంటివి తినటమే మంచిది. వీటిల్లో సంక్లిష్ట పిండి పదార్థాలే కాకుండా.. పీచూ దండిగా ఉంటుంది. మలబద్ధకం, రక్తంలో ఉన్నట్టుండి గ్లూకోజు మోతాదులు పెరగటం వంటి ఇబ్బందులు తలెత్తవు. మధుమేహం, ఊబకాయులకివి బాగా సహాయపడతాయి. ఇలాంటి సహజ సంక్లిష్ట పిండి పదార్థాలు తినటం వీలు కాని సమయంలోనే చల్లారిన ఆహారంలోని కఠిన పిండి పదార్థాల గురించి ఆలోచించాలి. ప్రత్యేకించి అన్నం, చపాతీలను చల్లార్చుకొని, తింటే ఉపయోగాలున్నట్టు శాస్త్రీయ ఆధారాలు ఎక్కువగా కనిపించలేదు. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త అవసరం ఉంటుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఫ్రిజ్‌లో పెడితే ఇబ్బందేమీ ఉండదు. కానీ ఎక్కువసేపు బయట పెడితే పాచిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా వాంతులు, విరేచనాల వంటి లేనిపోని సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వేసవి కాలంలో అన్నం త్వరగా చెడిపోతుంది. కాబట్టి సరైన పద్ధతిలో భద్రపరచకుండా రాత్రిపూట వండినవి మర్నాడు తింటే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ఫలితంగా మంచి కన్నా కీడే ఎక్కువని గుర్తించాలి."
--డాక్టర్ ఎ.లక్ష్మయ్య, రిటైర్డ్ సైంటిస్ట్, ఐసీఎంఆర్-ఎన్‌ఐఎన్, హైదరాబాద్
కఠినం నాలుగు రకాలు
టైప్ 1: దంపుడు బియ్యం వంటి తవుడుతో కూడిన ధాన్యాలు, బాదం వంటి గింజ పప్పులు, పప్పులు, నూనె గింజల్లో ఉంటుంది. ఇలాంటి రకం పిండి పదార్థం పీచుతో కూడిన కణ గోడల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మర పట్టి, పొట్టు తీస్తే తప్ప జీర్ణం కాదు.
టైప్ 2: అరటికాయ, పచ్చి బంగాళాదుంప, పచ్చి బొప్పాయి, క్యారట్, చిలగడ దుంప, బఠానీలు, చిక్కుళ్లు, జామ, పనస పండు వాటిల్లో ఉంటుంది. ఓట్స్, గోధుమ అటుకులు, కార్న్ ఫ్లేక్స్, ఉడికించని బియ్యం వంటి వాటిల్లోనూ లభిస్తుంది. ఈ పిండి పదార్థం దట్టంగా ఉండటం వల్ల ఇందులోని ఎంజైమ్‌లు అంత త్వరగా జీర్ణం చేయలేవు.
టైప్ 3: ఇది ఉడికించి, చల్లార్చిన అన్నం, చపాతీ, బంగాళాదుంప వంటి వాటిల్లో ఎక్కువగా ఉంటుంది. చల్లబడే క్రమంలో వీటిల్లోని కొంత పిండి పదార్థం సంక్లిష్టంగా మారుతుంది.
టైప్ 4: పిండి పదార్థాన్ని రసాయనికంగా మార్చటం ద్వారా దీన్ని తయారుచేస్తారు. సాధారణంగా బ్రెడ్, కేక్స్, పాస్తా వంటి వాటిల్లో పీచును కలపటానికి దీన్ని వినియోగిస్తారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
లేడీస్‌కు కడుపునొప్పి ఎందుకు వస్తుంది? పీరియడ్స్ పెయిన్ కాకుండా కారణం ఏంటో తెలుసా?
వారానికి కనీసంగా పెరుగు తింటే - పెద్ద పేగు క్యాన్సర్ ముప్పు అడ్డుకోవచ్చట! - కీలక పరిశోధన