Archaeological Survey of India Report : 'హాయ్ రా! నేను ఫస్ట్ టైమ్ హైదరాబాద్ వెళుతున్నాను. అవునా. అయితే నువ్వు తప్పకుండా చార్మినార్, గోల్కొండ కోట చూసి తీరాల్సిందే. హైదరాబాద్ వెళ్లి ఆ రెండు కట్టడాలు చూడకపోతే, వెళ్లామని చెప్పుకోవడమే వేస్ట్' ఇది ఓ ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన సంభాషణ. ప్రపంచ నలుమూలల నుంచి ఎవరు వచ్చినా సరే ఈ రెండింటినీ చూడకుండా వెళ్లరు. వాటిని చూసి 'వాట్ ఏ బ్యూటిఫుల్ హిస్టారికల్ ప్లేసెస్' అని అనక మానరు.
ఇప్పుడు గోల్కొండ కోట, చార్మినార్ గురించి ఎందుకు ఇంతలా చెప్పుకుంటున్నారని అనుకుంటున్నారా? మరేం లేదు, దేశంలోనే అత్యధిక పర్యాటకులు సందర్శించిన చారిత్రక ప్రదేశాల జాబితాలో ఈ రెండు స్థానం దక్కించుకున్నాయి. భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) 2023-24 సంవత్సరంలో దేశీయ పర్యాటకులు సందర్శించిన టాప్-10 ప్రదేశాల జాబితాలో గోల్కొండ కోట ఆరో స్థానంలోనూ, చార్మినార్ తొమ్మిదో స్థానంలోనూ నిలిచాయి.
ఈ జాబితాను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సోమవారం విడుదల చేసింది. ఆగ్రాలో ఉన్న ప్రపంచపు వింత తాజ్‌మహల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ ఏడాదిలో 61 లక్షల మంది దేశీయ సందర్శకులు తాజ్‌మహల్‌ను సందర్శించారు.
కొవిడ్ తర్వాత 30 శాతం వృద్ధి : కరోనాతో తెలంగాణలో పర్యాటక రంగం కుదేలైంది. ప్రస్తుతం క్రమంగా కోలుకుంటోంది. ఇందుకు పురావస్తు శాఖ తాజా జాబితానే నిదర్శనంగా నిలుస్తోంది. కొవిడ్ విజృంభణ తర్వాత హైదరాబాద్ పర్యాటకం దాదాపు 30 శాతం వృద్ధిని సాధించింది. దీనికి కారణం నగరానికి పురాతన చరిత్ర ఉండటం, ఆధునిక సదుపాయాలు, రుచికరమైన వంటకాలు లభించడం వంటివే ప్రధాన కారణం. ఇందులో భాగంగా 2023-24 ఏడాదిలో గోల్కొండ, చార్మినార్ రెండూ కలిపి 28 లక్షల మందికి పైగా దేశీయ పర్యాటకులను ఆకర్షించాయి. ఇది భారతీయ పురావస్తు శాఖ ఇచ్చిన నివేదిక.
పెరిగిన పర్యాటకులు : గోల్కొండ కోటకు 2023-24లో 16.08 లక్షల మంది రాగా, 2022-23లో 15.27 లక్షల మంది వచ్చారు. గోల్కొండను మునుపటి ఏడాది కంటే ప్రస్తుతం 80 వేల మంది ఎక్కువగా సందర్శించారు. ఇక చార్మినార్ విషయానికి వస్తే 2023-24లో ఏకంగా 12.90 లక్షల మంది సందర్శించగా, 2022-23లో కేవలం 9.29 లక్షల మందే సందర్శించారు. గతేడాదితో పోల్చితే ఇప్పుడు 3.60 లక్షల మంది ఎక్కువగా సందర్శించడం గమనార్హం. దీంతో కొవిడ్ తర్వాత హైదరాబాద్ పర్యాటక రంగం క్రమంగా వృద్ధిని నమోదు చేసిందని తెలుస్తోంది. అందుకే ఈ రెండు కట్టడాలను హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా చెబుతారు.
చార్మినార్ నైట్ బజార్- పర్యాటకులతో నయా జోష్ - Charminar Night Bazaar